YSRCP : వైసీపీ నేతలకు దినదిన గండంగా గడప గడప కార్యక్రమం

YSRCP :  వైసీపీ నేతలకు దినదిన గండంగా గడప గడప కార్యక్రమం
X
YSRCP : పథకాలు అందుతున్నాయా అని అడగడానికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను.. అసలు పథకాలు ఎక్కడిస్తున్నారు

YSRCP : గడప గడపకు కార్యక్రమం వైసీపీ నేతలకు దినదిన గండంగా మారింది. పథకాలు అందుతున్నాయా అని అడగడానికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను.. అసలు పథకాలు ఎక్కడిస్తున్నారు, ఎవరికిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మొదటి ఏడాది అందుకున్న అమ్మ ఒడి నుంచి రైతు భరోసా వరకు, రేషన్ కార్డుల నుంచి పెన్షన్ల వరకు అన్నిటినీ కట్ చేస్తున్నారని నిలదీస్తున్నారు లబ్దిదారులు. మహిళలైతే.. సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్నదెంత, తిరిగి తీసుకుంటున్నది ఎంతో లెక్క చెప్పాలని నిలదీస్తున్నారు. ఇక గుంతలుపడిన రోడ్లు, కరెంటు బిల్లులు, పన్ను పోట్లు, ఊర్లలో అభివృద్ధి పనులు ఆగకపోవడంపై సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలను, మంత్రులను నిలబెట్టేస్తున్నారు జనం. చాలా చోట్ల ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జారుకుంటున్నారు ప్రజాప్రతినిధులు.

ఊళ్లల్లో తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే.. పథకాలు వస్తున్నాయా అమ్మా అని అడగడమేంటని నిలదీస్తున్నారు మహిళలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కోలమూరులో వైసీపీ ఇన్‌ఛార్జ్‌ నరసింహరాజు గడప గడపకు వెళ్లారు. మంచినీళ్లు రావడం లేదని అధికారులను అడిగితే.. పాతికవేలు కట్టమంటున్నారంటూ నరసింహరాజును నిలదీశారు. మహిళలకు సర్దిచెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఎదురుగా ఉన్నది మంత్రి అని కూడా చూడట్లేదు జనం. మూడేళ్ల తరువాత దొరికారు అంటూ నిలదీసేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకే కాబోలు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నిన్న గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఒకే ఒక్క గడపకు వెళ్లి వచ్చారు. కలువాయి మండలం వేరుబొట్లపల్లిలో జడ్పీ ఛైర్మన్‌ ఆనం అరుణమ్మతో కలిసి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి.. ఒక్క ఇంటి దగ్గరకు వెళ్లి తిరిగి వెళ్లిపోయారు. నాయకుల తీరుపై కలువాయి మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డిని జనం బాగానే టార్గెట్ చేస్తున్నారు. పథకాలపై వాకబు చేయడానికి వెళ్తున్న సిద్ధారెడ్డిని మంచినీళ్లు, రోడ్ల గురించి ప్రశ్నిస్తున్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజవర్గంలోని తలుపుల మండలం ఊడములకుర్తిలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. అక్కడ కూడా స్థానిక సమస్యలపైనే జనం ప్రశ్నించారు. కోనసీమ జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు నిరసన సెగ తగిలింది. రోడ్లు, డ్రైనేజీ అధ్వానంగా ఉన్నాయంటూ అంబాజీపేట మండలం చిరతపూడి, చిట్టి చెరువు గట్టు ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం 27 పథకాలను తీసేసిందని, ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు మాట్లాడడంలేదంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే చిట్టిబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags

Next Story