AP Elections: కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాట్లు

AP Elections: కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాట్లు
కుదిరిన టీడీపీ-జనసేన-బీజేపీ సీట్ల సర్దుబాటు …ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారంటే..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన – బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా బీజేపీ- జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు. మొత్తం 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో జనసేన-బీజేపీ పోటీ చేయనున్నాయి. వీటిలో 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ.. 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన బరిలోకి దిగనున్నాయి. మిగిలిన చోట్ల టీడీపీ పోటీ చేయనుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో.. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, బీజేపీ జాతీయనేత బైజయంత్‌ ఏకాభిప్రాయానికి వచ్చారు. అనంతరం మూడు పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని నేతలు పేర్కొన్నారు. సీట్ల పంపకం విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఒక అంగీకారానికి వచ్చామని తెలిపారు. ఈ చర్చలతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందని మూడు పార్టీల నేతలు వెల్లడించారు. సీట్ల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తామని వివరించారు.


బీజేపీ పోటీ చేసే ఎంపీ స్థానాలు !

అరకు

విజయనగరం

అనకాపల్లి

రాజమహేంద్రవరం

నర్సాపురం

తిరుపతి

జనసేన పోటీ చేసే ఎంపీ స్థానాలు

కాకినాడ

మచిలీపట్నం



టీడీపీ 144, జనసేన 21, భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లోను పోటీ చేస్తాయి. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఏఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బైజయంత్‌ పండాలతో చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుంచి వచ్చిన భాజపా సీనియర్‌ నాయకులే పూర్తి చేశారు. వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి, ఖరారు చేశారు. చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు రాజమహేంద్రవరం నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగతా నాలుగు స్థానాలకు బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ నేడు ప్రకటించే రెండో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతోపాటు మరో నాలుగు స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.

Tags

Read MoreRead Less
Next Story