AP Minister : ఉడికించిన చికెన్, గుడ్లు తినొచ్చు: మంత్రి అచ్చెన్నాయుడు

బర్డ్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తింటే ప్రమాదం ఏమీలేదని తేల్చి చెప్పారు. బర్డ్‌ఫ్లూపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు భయాందోళనలు సృష్టిస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం, శాస్త్రవేత్తలతో చర్చించామని, కోళ్లకు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కి.మీ పరిధికే ఇది పరిమితం అవుతుందని చెప్పినట్లు వెల్లడించారు.
‘‘బర్డ్‌ఫ్లూపై కొన్ని పత్రికలు, సోషల్ మీడియా ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలను భయాందోళనకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు. ఉంగుటూరులో ఒకరికి బర్డ్‌ఫ్లూ సోకిందని ఓ పత్రికలో రాశారు. ఇలాంటి తప్పుడు వార్తల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతారు. బర్డ్‌ఫ్లూపై శాస్త్రవేత్తలు, కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చించారు. కేంద్రం, శాస్త్రవేత్తలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తున్నాం’’ అని తెలిపారు.
ఏపీలో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోవడంతో చికెన్ తినడానికి ప్రజలు సంకోచిస్తున్నారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ లో సేల్ 50% తగ్గిందని వ్యాపారులు తెలిపారు. తెలంగాణ లో వైరస్ వ్యాప్తి లేకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం వల్ల జనం భయందోళన చెందుతున్నారని అంటున్నారు. అయితే చికెన్‌ను 70-100 డిగ్రీల సెల్సియస్ వేడిలో బాగా ఉడికించి తింటే ఏ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com