AP: పరారీలో మాజీ మంత్రి కాకాని.. !

AP: పరారీలో మాజీ మంత్రి కాకాని.. !
X
మాజీ మంత్రులకు కేసుల ఉచ్చు.. కాకాని ఆచూకీ కోసం జల్లెడ పడుతున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపైన ముమ్మరంగా విచారణ చేస్తున్న కూటమిస సర్కార్.. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది. తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక, భూ దందాలు చేశారనే ఆరోపణల్లో జగన్ కేబినెట్ లో పని చేసిన ఆరుగురు మంత్రులకు ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి పైన చర్యలు తీసుకోవాలంటూ రెవిన్యూ అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో కాకాణికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాకాణి, ఆయన పీఏకు ఫోన్లు చేస్తే స్విచ్ఛాఫ్ వస్తున్నాయని చెప్పారు.

కాకాణి ఆచూకీ కోసం జల్లెడ

ఇప్పటికే పరారీలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి.. పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన ఆయన ఆచూకీ కోసం నెల్లూరు పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు పోలీసులు.. హైదరాబాద్‌కు చేరుకుని మరీ వెతుకుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన 3 ఇళ్ల వద్దకు నెల్లూరు పోలీసులు వెళ్లి ఆరా తీస్తున్నారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో కాకాణి బంధువులకు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్‌, రవాణాకు పాల్పడ్డారంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇప్పటికే పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనలకు అతిక్రమించి మైనింగ్‌లో పేలుడు పదార్థాలు ఉపయోగించారని కాకాణిపై ఆరోపణలు ఉన్నాయి. సోమవారం కాకాణి విచారణకు రాకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా హైదరాబాద్‌లోని కాకాణి నివాసాలకు వెళ్లిన పోలీసులు ఆయన ఆచూకీ కోసం ఆరా తీశారు.

సీదిరి అప్పలరాజుకు తప్పని కేసులు

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం అంతా ఇప్పుడు సీదిరి అప్పలరాజు చుట్టూనే నడుస్తోంది. అప్పలరాజును పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. ఆయనపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఢిల్లీరావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతుందంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేసినందుకుగాను మాజీ మంత్రి సీదిరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ అప్పలరాజుతో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేశారు.

విడదల రజినీపైనా కేసు

వైసీపీ మాజీమంత్రి విడుదల రజినికి ఏసీబీ షాక్ ఇచ్చింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విడదల రజినితో పాటు నాటి రీజనల్ విజిలెన్స్ అధికారి ఐపీఎస్ జాషువాపైన కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ1గా విడదల రజిని, ఏ2 గా ఐపీఎస్ అధికారి జాషువా, ఏ3గా విడదల గోపి, ఏ4గా రామకృష్ణ ఉన్నారు.

Tags

Next Story