SUNITHA: సాక్ష్యాలతో సునీత సంచలన వ్యాఖ్యలు

SUNITHA: సాక్ష్యాలతో సునీత సంచలన వ్యాఖ్యలు
ఆ దృశ్యాలు చూస్తే గుండెపోటు అనుకుంటారా... జగన్‌కు సునీత సూటి ప్రశ్నలు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని ఆయన కుమార్తె డాక్టర్ సునీత అభిప్రాయపడ్డారు. పైస్థాయిలో ఒత్తిళ్లు ఉన్నందునే వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగడం లేదని... అనుమానంవ్యక్తంచేశారు. వివేకా హత్య జరిగిన రాత్రి..ఆ మర్నాడు జరిగిన పరిణామాలు, నిందితుల మధ్య జరిగిన కాల్ డేటా, ఆడియో, వీడియో ఫుటేజ్ లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన సునీత ఇన్ని ఆధారాలు ఉన్నా న్యాయం కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలని ప్రశ్నించారు.


వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి ఛార్జిషీట్లో సీబీఐ నలుగురు నిందితుల పేర్లు చెప్పిందని ఆయన కుమార్తె డాక్టర్ సునీత వెల్లడించారు. ఏ1గా ఎర్రగంగిరెడ్డి, ఏ2 సునీల్ యాదవ్ , ఏ3 ఉమాశంకర్రెడ్డి , ఏ4 దస్తగిరి ఉన్నారన్నారు. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి లతో ఎంపీ అవినాష్ రెడ్డికి పరిచయం ఉందన్నారు. ఆయనతో సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ దిగిన ఫొటోలు ప్రదర్శించారు. వివేకా వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి ఆయనకు చాలా సన్నిహితుడని ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయన్నారు. అవినాష్ మాత్రం వీళ్లెవరో తెలియదని అంటున్నారని ఈ ఫొటోలు, ఫోన్ డేటా చూస్తే అతడితో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుందంటూ వాటి క్లిపింగ్‌లను ప్రదర్శించారు. వివేకా బలమైన నాయకుడని... ఆయన స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అవినాష్ అసూయ పడినట్లు చెప్పారు. వివేకా హత్య జరుగుతున్న సమయంలో అవినాష్- ఎర్ర గంగిరెడ్డి మధ్య ఫోన్ కాల్స్ నడిచాయన్నారు. దీనికి సంబంధించిన కాల్‌ లిస్ట్‌ను సునీత బయటపెట్టారు.


హత్య జరిగిన తెల్లవారుజామున 3గంటల సమయంలో వివేకానంద రెడ్డి ఇంటి వద్ద నుంచి ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడని... ఆ వ్యక్తి గజ్జెల ఉమాశంకర్‌రెడ్డిగా సీబీఐ తేల్చిందన్నారు. నిందితుడు పరుగులు పెడుతున్న దృశ్యాలు, హత్య జరిగిన తర్వాత మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వైకాపా నేతల వ్యాఖ్యలను ఆమె పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో వివరించారు. పైస్థాయిలో ఒత్తిళ్లు ఉన్నందునే వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగడం లేదని C.B.I. చేయాల్సింది ఇంకా ఉందని సునీత అన్నారు. తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ... సునీత భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల వివేకా సోదరి విమలారెడ్డి షర్మిల, తనపై చేసిన విమర్శలపై సునీత స్పందించారు. నిందితులకు వత్తాసు పలకడం సరికాదన్నారు. న్యాయం కోసం సీఎం జగన్ సహా ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధమని సునీత అన్నారు. ఏదైనా చెబుదామన్నా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. సీఎంపై రాయి వేసిన వారితో పాటు వివేకాను హత్య చేసిన వారికి సైతం శిక్ష పడాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story