CBN: నన్ను లేపేస్తావా.. ఇక్కడున్నది చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం.. పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం.. వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు లాభం వచ్చేలా ఏ పంట వేయాలో అధ్యయనం చేసి చెబుతామన్నారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీనికి తోడుగా కేంద్రం ‘పీఎం కిసాన్’ పథకం కింద మొదటి విడతగా రూ.2 వేల చొప్పున రైతులకు సాయం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7 వేలు చొప్పున జమ చేశాయి. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందించనున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఎన్నికల ముందు రాక్షస పాలన చూశామని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఇబ్బందిపడుతూ పెన్షన్లు పెంచారని అయితే కూటమి పాలనలో ఒక్కసారే పెన్షన్లు పెంచామని ప్రజలకు వివరించారు.
జగన్ నుంచి ఏం నేర్చుకోవాలి
రాజకీయాలు ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. వారి అంతిమ లక్ష్యం అధికారం అయినా కట్టుబాట్లు, పద్దతులు, నైతికవిలువలు తప్పనిసరిగా ఉండాలన్నారు. తనను చూసి వాటిని నేర్చుకోవాలన్నారు. కానీ జగన్ ను చూసి ఏం నేర్చుకుంటారని ప్రశ్నించారు. గొడ్డలి పోట్లు, రప్పా రప్పా, బూతు పంచాంగం నేర్చుకుంటారా అని ప్రశ్నించారు. మావాళ్లకు చెబితే లేపేస్తారని అంటున్నారని..నువ్వు లేపేస్తావా.. ఇక్కడ ఉన్నది సీబీఎన్ అంటూ హెచ్చరించారు. తాను ఎంతో మందితో పోరాడానని చెప్పారు. తీవ్రవాదులు, కమ్యునల్ గొడవలు సృష్టించేవాళ్లతో పోరాడానని అన్నారు. ఇప్పుడు నేరస్థులు రాజకీయ ముసుగులో వస్తున్నారని, వాళ్ల ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగా పరిగణించాలని చెబుతున్నానని అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తి గత జీవితాన్ని ఒక మాజీ ఎమ్మెల్యే విమర్శించాడని.. అతను పశువువా లేకా మనిషా అర్థం కావడం లేదని చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. నేనైతే మరోసారి అలాంటివి జరగకుండా మందలించేవాడిని అని కానీ జగన్ ఆ మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి పరామర్శించాడని అన్నారు. అవసరమైతే ఇళ్లల్లోకి వెళ్లి టీడీపీ వాళ్ళని లేపేస్తామని జగన్ అన్నాడని, నేను ఒకసారి ఏమారితే నారాసుర రక్త చరిత్ర అని జగన్ తన పత్రికలో రాశారని చంద్రబాబు కామెంట్స్ చేశారు. జగన్ లేపేస్తే చూస్తూ ఊరుకోమని ఇక్కడ ఉండేది సీబీఎన్ అని చంద్రబాబు హెచ్చరించారు. ముసుగులు తొలగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com