AP : ఏపీలో కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. లోకేశ్ హర్షం

AP : ఏపీలో కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. లోకేశ్ హర్షం
X

దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. దీనితో పాటు ఒడిశా, పంజాబ్‌లలో కూడా యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టుల కోసం రూ.4,594 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

కీలక క్యాబినెట్ నిర్ణయాలు:

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఆరు సెమీకండక్టర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉండగా, ఇప్పుడు కొత్తగా ఆమోదించిన నాలుగు ప్రాజెక్టులతో ఈ సంఖ్య 10కి చేరింది. ఈ ప్రాజెక్టులు 2034 నాటికి నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా, టెలికాం, ఆటోమోటివ్, డేటా సెంటర్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మంత్రి నారా లోకేశ్ హర్షం:

ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ల ప్రాజెక్టును కేటాయించడంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో సెమీకండక్టర్ తయారీ ఏపీకి వస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్టులో దక్షిణ కొరియాకు చెందిన APACT కో. లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు, దీని వార్షిక సామర్థ్యం 96 మిలియన్ యూనిట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి దోహదపడుతుందని లోకేశ్ పేర్కొన్నారు.

Tags

Next Story