PEMMASANI: జగన్ బయట తిరిగితే తీవ్ర నష్టం
జగన్ రోడ్డు మీద తిరిగిన ప్రతి క్షణం ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టమని, ఆయన రోడ్డుపైకి వస్తే రాష్ట్రాభివృద్ధి వెనుకబడుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మాచర్లలో చంద్రయ్యను అతికిరాతకంగా చంపారని.. రాజకీయ హత్య అంటే అదని పెమ్మసాని అన్నారు. చంద్రయ్య కుటుంబాన్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. వినుకొండలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగి హత్యకు దారితీస్తే దానిని రాజకీయం చేస్తారా అని పెమ్మసాని నిలదీశారు. మాచర్లలో హత్య జరిగినప్పుడు బయటకు వచ్చారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో హత్యలు చేసింది.. రాష్ట్రాన్ని అత్యంత అవినీతిమయంగా మార్చింది జగనేనని మండిపడ్డారు. ఢిల్లీలో ఎక్కడికి వెళ్లినా ఏపీ గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉందన్నారు.
హింసను అణిచేస్తాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలో ఎవరు హింసకు పాల్పడినా ఉక్కుపాదంతో అణచివేస్తామని, శాంతిభద్రతల్ని కాపాడటంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు. శాంతిభద్రతల్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని.. ఏ మాత్రం అదుపు తప్పినా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజలు పూర్తిగా తిరస్కరించినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదని, ఉనికి చాటుకోవడానికి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక 36 మందిని హత్య చేశారంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తుంటే.. మంత్రులు, టీడీపీ నాయకులు గట్టిగా తిప్పికొట్టకపోవడంపై ఆయన కొంత అసహనం ప్రకటించారు. ఆ 36 మంది పేర్లు, వివరాలు బయటపెట్టాలని గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని మంత్రులు, ఎంపీల్ని ప్రశ్నించారు. శ
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించిన చంద్రబాబు... శాంతిభద్రతలపై ప్రత్యేకంగా చర్చించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. హోం మంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలని, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టాలని ఆయన ఆదేశించారు. పోలీసు అధికారులు వెంటనే స్పందించకపోతే సస్పెండ్ చేయడానికైనా వెనుకాడొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. మతఘర్షణలు, ఫ్యాక్షన్, నక్సలిజం, రౌడీయిజాన్ని నియంత్రించిన చరిత్ర మనకుందని గుర్తు చేశఆరు. మనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని... కానీ మనం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు దూరంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో మనపై తప్పుడు కేసులు పెట్టారని... జైళ్లకు పంపారని గుర్తు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com