Chandrababu: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు పర్యటిస్తారు. జగ్గంపేట- పెద్దాపురం -అనపర్తి నియోజకవర్గాల్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. నెల గ్యాప్‌తో చంద్రబాబు మళ్లీ జనంలోకి వెళ్తున్నారు. డిసెంబర్ చివరి వారంలో పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. తర్వాత సంక్రాంతి రావడంతో విరామం ప్రకటించారు. ఒకవైపు చంద్రబాబు మరోవైపు లోకేష్ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ ఫుల్ బిజీ అయిపోయింది.
ముందుగా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తారు. రేపు పెద్దాపురం, ఎల్లుండి అనపర్తి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ టూర్‌ను సక్సెస్ చేసేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలంతా భారీ ఏర్పాట్లు చేశారు. యువత బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. చంద్రబాబు పర్యటనతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా పసుపు మయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా చంద్రబాబు కటౌట్లే కనిపిస్తున్నాయి.
మరోవైపు చంద్రబాబు టూర్‌కు సంబంధించి జిల్లా ఎస్పీకి అనుమతికి దరఖాస్తు చేశారు. అయితే ఇంతవరకు అనుమతిస్తున్నట్లు కానీ ఇవ్వడం లేదని కానీ పోలీసులు సమాచారం ఇవ్వలేదు. జీవో 1తో ఇప్పటికే లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రచార రథంతో పాటు మైకులను సీజ్ చేశారు . మరి చంద్రబాబు పర్యటనను సైతం పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఇటు చంద్రబాబు అటు లోకేష్ వరుస పర్యటనలతో టీడీపీ క్యాడర్‌లో జోష్ పెరిగింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఇక ఈ నెల 21 నుంచి 25 వరకు పలు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నెల 21న విశాఖ, 22న ఏలూరు, 23న అమరావతి, 24న నెల్లూరు, 25న కడపలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఐదు పార్లమెంట్ స్థానాలు, 35 అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దిశగా చంద్రబాబు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com