Chandrababu : డోన్ అభ్యర్థిగా ధర్మారం సుబ్బారెడ్డిని ప్రకటించిన చంద్రబాబు

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొనసాగుతోంది. నందికొట్కూర్ రోడ్డులోని యడ్ల పుల్లారెడ్డి ఫంక్షన్ హాలులో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం డోన్ నుంచి గోసానిపల్లి, చింతలపేట, కొచ్చెరువు, చిగురుమాను, గోపాల్‌నగరం గ్రామాల మీదుగా రోడ్ షో నిర్వహించారు. రాత్రి డోన్ సెగ్మెంట్‌లోని జలదుర్గంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపారు. ఎడ్లబండి నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు చంద్రబాబు.
తాను ప్రజల్లో చైతన్యం కోసం వస్తే... ప్రజలే ముందుండి తనను స్వాగతిస్తున్నారని ఆనందపడ్డారు చంద్రబాబు. జగన్ బాదుడే బాదుడుతో ప్రజలెవ్వరూ సంతోషంగా లేరని... తన రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను ఎన్నడూ చూడలేదన్నారు. కర్నూలు ప్రజలు పక్క రాష్ట్రమైన కర్నాటకకు వెళ్లి పెట్రోల్ తెచ్చుకుంటున్నారని... ఇదీ జగన్ సాధించిన విజయమంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే నవగ్రహాల చుట్టూ తిరగాలన్నారు చంద్రబాబు. డ్రగ్స్, గంజాయికి ఏపీ కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయని... ఉద్యోగులు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. చెత్తకు పన్ను వేసే చెత్త ముఖ్యమంత్రి... మూడేళ్లయినా టిడ్కో ఇళ్లను ఇవ్వకుండా ప్రజలను వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ఇక డోన్ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు చంద్రబాబు. డోన్ టీడీపీ అభ్యర్థిగా ధర్మారం సుబ్బారెడ్డిని ఉంటారని వెల్లడించారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా... అందరూ సుబ్బారెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుందని.. తన జీవితంలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని.. విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com