Chandrababu: గ్రామ సర్వాధికారాలు సర్పంచ్‌లకే : బాబు హామీ

Chandrababu: గ్రామ సర్వాధికారాలు సర్పంచ్‌లకే : బాబు హామీ
పెండింగ్‌ బిల్లుల చెల్లింపుకు అభయం

గ్రామంలో సర్పంచ్‌లకు ఉన్న సర్వ అధికారాలను తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి అందజేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులనే పంచాయతీలకే కేటాయిస్తామని తెలిపిన చంద్రబాబు....పెండింగ్‌ బిల్లులను వడ్డీతో సహా చెల్లిస్తామని అభయమిచ్చారు. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులు పంచాయతీలకు కేటాయిస్తామని...వచ్చే 5ఏళ్లలో ఈ నిధుల్ని 10శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్‌ల ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. స్థానిక సుపరిపాలన,ఆత్మ గౌరవం ,ఆత్మ విశ్వాసం నినాదంతో పంచాయతీలకు ఆయన ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించారు. స్థానిక సంస్థల గౌరవాన్ని జగన్ తగ్గించేశాడని మండిపడిన చంద్రబాబు...తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచ్‌లకు ఉన్న అన్ని అధికారాలను తిరిగి అప్పగిస్తామని స్పష్టం చేశారు. గౌరవ వేతనాలు సైతం పెంచుతామన్నారు. గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో సర్పంచ్‌లే కీలక భూమిక పోషించేలా ప్రత్యక చర్యలు చేపడతామన్నారు.

ఆర్థిక సంఘం నిధులను జగన్ దారిమళ్లించారని చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు చేరేలా చూస్తామన్న ఆయన ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి బడ్జెట్‌లో 5 శాతం నిధులు పంచాయతీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్‌ల రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరైన అధికారపార్టీ సర్పంచ్‌లు ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. అధికార పార్టీలో ఉండి కూడా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు హాజరైన పలువురు వైకాపా సర్పంచ్ లను సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ నుంచి వారి ఫోన్లకు ఎస్ఎంఎస్ లు వచ్చాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు తామే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి తెలుగుదేశంలో చేరారు.

Tags

Next Story