BHUVANESHWARI: ప్రజలకు మంచి చేయడమే తప్పా?

BHUVANESHWARI: ప్రజలకు మంచి చేయడమే తప్పా?
చంద్రబాబు నిరంతరం ప్రజల కోసమే శ్రమించారన్న భువనేశ్వరి... ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని స్పష్టీకరణ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మనిషి అని, నిరంతరం వారికోసమే తపించి పనిచేసే వ్యక్తి తప్పు చేస్తారా? అని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజల మనిషని, ఎప్పుడూ ప్రజలను ముందుకు తీసుకువెళ్లడం లక్ష్యంగా పనిచేయడమే ఆయనకు తెలుసని ఆమె అన్నారు. అలాంటి వ్యక్తిని 17రోజులుగా జైల్లో నిర్బంధించారు. నేను ఒక్కటే అడుగుతున్నా... ఆయన ఏం తప్పుచేశారు.. అని భువనేశ్వరి ప్రశ్నించారు. మనుషులే దేవుళ్లు ఆని నమ్మిన మా తండ్రి ఎన్టీఆర్‌ నీడలో పుట్టి పెరిగిన దాన్నని.. మా నాన్నగారు నేర్పిన విలువలను మా కుటుంబంలో అందరం పాటించి ఎన్టీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తామని తేల్చి చెప్పారు.


తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అ‌క్రమంగా నిర్బంధించి రెచ్చగొడుతున్నారని నారా భువనేశ్వరి హెచ్చరించారు. చంద్రబాబు సింహంలా గర్జిస్తూ రెట్టించిన ఉత్సాహంతో ప్రజాసేవ చేస్తారని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ, నెహ్రూ వంటి మహనీయులు జైలుకు వెళ్లారని, ప్రజల హక్కుల కోసం చంద్రబాబు జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. చంద్రబాబు అరెస్టును ఆయన సతీమణి భువనేశ్వరి తీవ్రంగా ఖండించారు. 45 ఏళ్లుగా ప్రజల అభివృద్ధి కోసం పరితపిస్తున్నందుకే ఆయన్ని అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో తెలుగుదేశం రిలే నిరాహార దీక్షల శిబిరం వద్దకు వచ్చిన ఆమె... బాబుకు మద్దతుగా చేపట్టిన లక్ష సంతకాల సేకరణలో తొలి సంతకం చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.


చంద్రబాబును జైలులో మానసిక క్షోభకు గురి చేయాలని ప్రభుత్వం పనికిమాలిన చేష్టలు చేస్తోందని, జైలులో ఆయన కొన్నిరోజులు చేతిలో ప్లేటు పెట్టుకుని భోజనం చేశారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భోజనం ప్లేటు పెట్టుకోవడానికి చిన్న టేబుల్‌ కూడా ఇవ్వలేదన్న ఆమె తమ లాయర్‌ లెటర్‌ పెడితే చిన్నటేబుల్‌ ఇచ్చారని, ఇలాంటి చర్యలతో చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఏం తప్పు చేశారని ఆయన్ని జెలుకు పంపారని భువనేశ్వరి ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు తీసుకొచ్చిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వల్ల వేలాది మంది మంచి జీతాలు పొందుతూ ఉన్నతస్థానాలకు ఎదిగారని భువనేశ్వరి గుర్తుచేశారు.

ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి చేపట్టిన శాంతియుత కార్ల ర్యాలీని అడ్డుకోవడాన్ని భువనేశ్వరి ఖండించారు. ఎక్కడికక్కడ ఐటీ ఉద్యోగుల కార్లను ఆపేశారని, హోటల్‌ రూంలు బ్లాక్‌ చేయించారని, ఫోన్‌లో మెసేజ్‌లు చూశారని.. ప్రజలు టెర్రరిస్టులా? హైదరాబాద్‌నుంచి రావడానికి పాస్‌పోర్టులు, వీసాలు అవసరమా అని భువనేశ్వరి ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story