జగన్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు : టీడీపీ అధినేత చంద్రబాబు

సీఎం జగన్ తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. తమ గొంతు నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఫించన్లను భారీగా కోసేశారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. అసెంబ్లీలో జగన్ ఒకలెక్క చెబుతున్నారని.. కానీ ప్రభుత్వ డాటాలో మరో లెక్క ఉంటోందన్నారు. సభలోనే ఇన్ని ఫేక్ లెక్కలు చెబుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు.. అసెంబ్లీ మీ తాత జాగీరు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో బీసీపై కక్ష సాధింపు సరైంది కాదన్నారు చంద్రబాబు. వీసీల నియామకంలో సామాజిక న్యాయం ఏది అని ప్రశ్నించారు. అందర్నీ రెడ్డిలను వేసి.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని నిలదీశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన చినరాజప్పను ద్వారం పూడి దుర్భాషలాడడం దారుణమన్నారు.
ఉత్తరాంధ్రను విజయసాయికి.. ఉభయ గోదావరి జిల్లాలను సుబ్బారెడ్డికి అప్పచెప్పి.. రాష్ట్రం మొత్తం మీద సజ్జలతో పెత్తనం చేయిస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. సజ్జల రామకృష్ణా రెడ్డి డి-ఫ్యాక్టో డీజీపీగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు చంద్రబాబు. నియంత పాలనతో రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని ఆరోపించారు.. మీడియాపైనా దాడి చేయడం దారుణమన్నారు చంద్రబాబు. జగన్‌కు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com