వారి బాధలు విని చలించిపోయిన చంద్రబాబు

వారి బాధలు విని చలించిపోయిన చంద్రబాబు

ఏపీలో పరిస్థితులను చూసి పొట్టిశ్రీరాములు ఆత్మ క్షోభిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ పాలనలో రౌడీలు, గూండాలు పెరిగిపోయారన్నారు.. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో వైశ్య నేతలతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. అమరావతి పట్ల ప్రధానే సుముఖంగా ఉన్నా.. జగన్‌ మాత్రం మూడుముక్కలాట ఆడుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు.

ఏపీలో అధికార పార్టీ నేతల అరాచకాలకు బలైపోతున్న బాధితులంతా చంద్రబాబు ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.. వారి బాధలు విన్న చంద్రబాబు చలించిపోయారు.. ఈ పరిస్థితిని తాను ముందుగానే ఊహించానని చెప్పారు. రాష్ట్రంలో రౌడీయిజం అనేదే లేకుండా తాము చేస్తే వైసీపీ హయాంలో రౌడీలకు ఏపీ అడ్డాగా మారిపోయిందని చంద్రబాబు విమర్శించారు.

సేవా కార్యక్రమాల కోసం దాతలు భూములిస్తే వైసీపీ నేతలు దాన్ని కూడా కొట్టేయాలని చూశారని చంద్రబాబు మండిపడ్డారు.. ఆస్తులు అభివృద్ధి చెందుతాయని జనం భావిస్తే వైసీపీ నేతలు మాత్రం వాటన్నిటినీ తమ పేర రాయించేసుకుంటున్నారని విమర్శించారు.. ఆరోజు ఎవరైనా అలా చేసుంటే మక్కెలు ఇరగ్గొట్టేవాడ్నంటూ ఆవేశంగా మాట్లాడారు.

రాష్ట్రంలో అవినీతి హోల్‌సేల్‌గా పెరిగిపోయిందన్నారు చంద్రబాబు.. ఎక్కడ చూసినా అవినీతి తప్ప మరోటి లేదన్నారు.. నాసిరకం మద్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారన్నారు.. కొండలు, అడవులు దేన్నీ వదలిపెట్టడం లేదన్నారు.. తాము ప్రజల కోసమే పోరాడుతుంటే.. ప్రజలు మాత్రం సహకరించడం లేదని చంద్రబాబు మండిపడ్డారు.

రాష్ట్రంలో తుఫాన్‌ పరిస్థితులు ఉంటే అంతకంటే ముందు తాను వెళ్లేవాడన్నని చంద్రబాబు గుర్తు చేశారు.. కానీ, ఈరోజు వరదలు వచ్చి జనం అల్లాడిపోతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.. దుర్మార్గుల పాలన వల్లే రైతులు నష్టపోతున్నారని అన్నారు.

రాష్ట్రంలో 40 నుంచి 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయన్నారు చంద్రబాబు.. ఇసుక కొరత సృష్టించి సామాన్యులకు అందకుండా చేశారని ఫైరయ్యారు.. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తే ఇప్పుడు పాలసీల మీద పాలసీలు తీసుకొచ్చి సర్వనాశనం చేశారన్నారు.

రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రతి దానికీ పన్నులు వేస్తూ జగన్‌ తుగ్లక్‌ను మించిపోతున్నారని అన్నారు.. చివరకు బాత్‌రూమ్‌కు నాలుగు సార్లు వెళ్తే నాలుగు సార్లు పన్ను వేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story