అమర్‌నాథ్‌ను అన్యాయంగా చంపేశారు: చంద్రబాబు

బంగారు భవిష్యత్ ఉన్న అమర్‌నాథ్‌ను అన్యాయంగా చంపేశారని.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెం వెళ్లిన ఆయన.. అమర్‌నాథ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. బాలుడి తల్లి, అక్కకు ధైర్యం చెప్పారు. చంద్రబాబును చూసి అమర్‌నాథ్ కుటుంబం భావోద్వేగానికి గురైంది. టీడీపీ అండగా ఉంటుందని వారికి చంద్రబాబు భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున 10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.
తన అక్కను వేధిస్తుంటే అడ్డుకున్నందుకు అమర్‌నాథ్‌ను చంపేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పదో తరగతి పిల్లాడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారని.. అందరూ వీళ్లకు సరెండర్ అయ్యి.. బలైపోవాలా? అని అన్నారు. అక్కను కాపాడుకోబోయి తమ్ముడు సజీవ దహనమయ్యాడని.. ఈ ఘటన జరిగాక ముఖ్యమంత్రి ఇక్కడికి రావాలా.. లేదా? అని నిలదీశారు. దోషుల్ని శిక్షించాలా.. వద్దా? అని అన్నారు. ఇదే కొనసాగితే రేపు భర్త ముందే భార్యపై అఘాయిత్యం చేస్తారని.. ముఖ్యమంత్రికి కూడా ఆడబిడ్డలు ఉన్నారు.. నీ కూతురికి ఇలాగే జరిగితే ఊరుకుంటావా? అని ప్రశ్నించారు. ఇక్కడికి ఎమ్మెల్యే అనగాని ప్రసాద్ రాకపోతే ఏం జరిగేదని.. అమర్‌నాథ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేవాళ్లా.. కాదా? అని అన్నారు. ప్రభుత్వం లక్ష ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com