ఏపీ అప్రదిష్టపాలు కాకుండా కాపాడుకుందాం.. ప్రజలకు చంద్రబాబు రిపబ్లిక్‌డే సందేశం

ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.. ప్రాథమిక హక్కులు, ఆదేశా సూత్రాలతో ప్రపంచానికే తలమానికమైన గొప్ప రాజ్యాంగాన్ని మనకిచ్చిన రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.. రాజ్యాంగ పెద్దల బాటలో నడవాలని, ఆ మహనీయులకు ఘన నివాళులర్పిద్దామని అన్నారు.
మన రాజ్యాంగ పెద్దలు ఇచ్చిన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. ప్రాథమిక హక్కులను కాలరాయడం రాజ్యాంగ ద్రోహమన్నారు. చట్టాలకు తూట్లు పొడవడం, అడుగడుగునా కోర్టు ధిక్కరణలు, పత్రికా స్వేచ్ఛ హరించడం గర్హనీయమన్నారు. రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నానికి పాల్పడటం హేయమన్నారు చంద్రబాబు. ఎవరెలా చేస్తే, ఏదెలా పోతే నాకెందుకులే అన్న నిర్లిప్తత సమాజానికే కీడు, ఉదాసీనత మన ఘన వారసత్వ సంపదకే చేటు అని గుర్తు చేశారు. ప్రశ్నించే హక్కు మన సొంతమని.. అణచివేతను ఎంత మాత్రం సహించకూడదని చెప్పారు.. హక్కుల కోసం పోరాటం రాజ్యాంగ పెద్దల నుంచి సంక్రమించిన మన ఘన వారసత్వం, గణతంత్ర దిన సందేశమని.. దీనిని నిలబెట్టుకోవడం ప్రతి భారతీయుడి విద్యుక్త ధర్మమని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామంటూ చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేవాళ్ల దుశ్చర్యలను అడ్డుకోవడం ద్వారా రాజ్యాంగ పెద్దల ఆశలను, ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అప్రదిష్టపాలు కాకుండా కాపాడుకుని తద్వారా భారతదేశం గౌరవం ఇనుమడింప చేద్దామని ప్రజలకు చంద్రబాబు రిపబ్లిక్‌డే సందేశం ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com