CBN: వైసీపీ ముగింపు దగ్గర్లోనే ఉంది
వైసీపీ ముగింపు దగ్గరలోనే ఉందని ఓడిపోవడానికే జగన్ సిద్ధం అంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశంలో చేరారు. ఎంపీతో పాటు నెల్లూరు వైకాపా కార్పొరేటర్లు, సర్పంచులను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన-తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే జగన్ కు నిద్రపట్టట్లేదని ఎద్దేవా చేశారు. మాజీమంత్రి వివేకహత్యపై సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆఖరుకు సొంత చెల్లెలు పుట్టుకపైనా నీచంగా విమర్శలు చేస్తుంటే... జగన్ ఖండించడంలేదన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్-క్విట్ జగన్ నినాదాన్ని... ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మరోవైపు NTR జిల్లా మైలవరం వైసీపీ MLA వసంత కృష్ణప్రసాద్... తెలుగుదేశంలో చేరారు. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఆయన సైకిలెక్కారు. MLA కృష్ణ ప్రసాద్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణ ప్రసాద్ సహా MPPలు, MPTCలు, సర్పంచ్ లు సహా అనుచరులు తెలుగుదేశంలో చేరారు. గత ఐదేళ్ల నుంచి ఏపీలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా నిలిచిపోయిందన్న కృష్ణ ప్రసాద్... ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు పాలన అవసరమని చెప్పారు. రాజధాని విషయంలో సీఎం జగన్ మాట మార్చారన్న కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గానికి తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. మైలావరం అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరినట్లు స్పష్టం చేశారు.
అనంతరం పల్నాడు జిల్లాలో తమ కార్యకర్తలను చంపిన నరహంతకులను వదిలిపెట్టేదిలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. మంచికి మంచి దెబ్బకు దెబ్బ ఉంటుందని తేల్చి చెప్పారు. తెలుగుదేశం, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టి తనకు, పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు సృష్టించలేరని స్పష్టంచేశారు. జగన్ తీరు నచ్చక అనేక మందితమ పార్టీలో చేరుతున్నారన్న చంద్రబాబు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయల్ని తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో "రా.. కదిలి రా" బహిరంగసభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా వైసీపీకు రాజీనామాచేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం-జనసేన గెలుపు ఎవ్వరూ ఆపలేరన్న ఆయన.. అవసరమైతే తొక్కుకుంటూ పోతామని వైకాపాను హెచ్చరించారు. పల్నాడులో... ఎందరో కార్యకర్తలు వైకాపా చేతిలో బలయ్యారని.. ఆవేదన వ్యక్తంచేశారు. మంచినీళ్లు అడిగితే సామిని బాయ్ అనే గిరిజన మహిళనుట్రాక్టర్‌తో తొక్కించి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరహంతకులను వదలబోమని హెచ్చరించారు. సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తమదన్న చంద్రబాబు అప్పులు చేయడం మాత్రమే తెలిసిన పార్టీ వైకాపా అని దుయ్యబట్టారు. కోవర్టులతో పవన్‌కు, తనకు మధ్య విభేదాలు సృష్టించలేరని చంద్రబాబు స్పష్టంచేశారు. నాగార్జున సాగర్ కుడికాలువ అభివృద్ధి పనులు, వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com