Chandrababu: డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబానికి చంద్రబాబు సాయం..

Chandrababu: డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబానికి అండగా నిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు. మృతుని కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
టీడీపీతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లే సుబ్రమణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారన్నారు. కళ్ల ముందు పెళ్లిళ్లు, పేరంటాలకు నిందితుడు వెళ్లినా అరెస్టు చేయకపోవడం విడ్డూరమన్నారు. సుబ్రమణ్యం మృతి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులపై నమ్మకం లేదంటున్నారు. అనంతబాబును పదవి నుంచి తప్పించాలని.. అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
సుబ్రమణ్యం కేసులో ఎమ్మెల్సీని A1గా చేర్చి 302 కేసు పెట్టారు పోలీసులు. దీంతో.. నిన్న రాత్రి పొద్దుపోయాక పోలీసులు ఇలా సెక్షన్లు మార్చారో లేదో వెంటనే ఎమ్మెల్సీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం రావడంతో అక్కడికి ప్రత్యేక బృందాల్ని పంపారు.
5 బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి. ఆయన గన్‌మెన్‌లు ఇచ్చిన సమాచారం ఆధారంగానూ విచారణ చేస్తున్నారు. అటు.. ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణం అరెస్టు చేయాలంటూ దళిత సంఘాల ర్యాలీలు హోరెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా అనంతబాబును తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com