చంద్రబాబు ఉంటున్న అతిథిగృహానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. చంద్రబాబు రాకతో కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సందడిగా మారింది. టీడీపీ అధినేతను కలిసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు, టీడీపీ కార్యకర్తలు వస్తున్నారు. స్థానిక ప్రజలు, కార్యకర్తల నుంచి చంద్రబాబు వినతిపత్రం స్వీకరించారు. అటు, బాబు ఉంటున్న ఈ అతిథిగృహానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడం చర్చనీయాంశమైంది. అక్కడ జనరేటర్ కూడా పనిచేయడం లేదని, YCP ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ స్థాయిలో దిగజారి రాజకీయాలు చేయడం తామెప్పుడూ చూడలేదని అంటున్నారు.
అటు చంద్రబాబు పర్యటనతో టీడీపీ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి. కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ టీడీపీ అధినేత పర్యటన కొనసాగుతోంది. కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పాటు చంద్రబాబు పర్యటిస్తుండడంతో నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇవాళ రెండో రోజు పర్యటనలో భాగంగా కాసేపట్లో రామకుప్పం మండల కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురంలోని నందిగామ కళ్యాణ మండపంలో కార్యకర్తలతో భేటీ కానున్నారు.
మరోవైపు తొలిరోజు కుప్పంలో చంద్రబాబు రోడ్ షోకు పార్టీ శ్రేణులు నిరాంజనం పట్టాయి. బాణా సంచా పేల్చుతూ ఘన స్వాగతం పలికారు నేతలు, కార్యకర్తలు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రజల సమక్షంలో ఎండగట్టారు చంద్రబాబు. సంక్షేమ పథకాలు నిలిపేస్తామంటూ ఓటర్లను బెదిరించి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దొడ్డిదారిన గెలిచిందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ అధికారుల పనితీరును సమీక్షిస్తానని.. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్క సంతకంతో మాఫీ చేస్తానన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com