Chandrababu : జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం : చంద్రబాబు

Chandrababu (tv5news.in)
Chandrababu : జగన్ పాలనతో ఏపీలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం నెలకొందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పార్టీ వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన... జగన్ రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్‌లో వెళ్తోందని మండిపడ్డారు.
నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాణి హస్తం ఉందని ఆరోపించారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంతవర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉందన్నారు. జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతోందని చంద్రబాబు విమర్శించారు.
జగన్ ఎంత బలహీనుడో కేబినెట్ విస్తరణ చూస్తేనే అర్థమవుతోందన్నారు చంద్రబాబు. వైసీపీలో ఉన్న డొల్లతనం, అసంతృప్తి మంత్రివర్గ విస్తరణతో బయటపడిందన్నారు. బ్లాక్ మెయిల్ చేసిన వారికి భయపడి జగన్ పదవులు ఇచ్చినట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోందన్నారు.
ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న విజయసాయిరెడ్డి.. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది కూడా దోపిడీ చేసేందుకేనని ఆరోపించారు. ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టానని చెప్పిన జగన్.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.
ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com