CBN: హైదరాబాద్ వెలిగిపోతోంది.. అమరావతి వెలవెలబోతోంది

సైకో పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఐదేళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్ రెడ్డి... ఎమ్మెల్యేలను ట్రాన్స్‌ఫర్ చేసి గెలవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అరాచక పాలకుడిని ఇంటికి పంపాలని ప్రజలంతా ఇప్పటికే ఫిక్స్ అయ్యారని గుర్తుచేశారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళితే... 2109 నుంచి తిరోగమనంలో నడిపిస్తున్నారని విమర్శించారు. తాను సీఎంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తే... వైసీపీ పాలనలో యువతను గంజాయి మత్తులో ముంచేశారని ఆరోపించారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం... తెలుగుదేశాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం నిర్వహించిన "రా..కదిలిరా..” బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు... జగన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, తెలంగాణ సరిహద్దు కావటంతో ఖమ్మం జిల్లా నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలివచ్చారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ నగరం, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల నుంచి నేతలు భారీ వాహన ర్యాలీలు చేపట్టారు. వేలాది వాహనాలతో ప్రదర్శనగా సభాస్థలికి తరలివచ్చారు.
నవ్యాంధ్రను కాపాడుకోవడానికి ప్రజలంతా కదిలిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని, రైతులను, బీసీలను, యువతను మోసం చేసిన అరాచక పాలన అంతానికి.... అన్నివర్గాల ప్రజల ఏకం కావాలన్నారు. రాజధాని నిర్మాణం కోసం, మహిళల అభ్యున్నతి కోసం, సకలజనుల సంక్షేమం-అభివృద్ధిని కాంక్షిస్తూ తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకున్నాయని... ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. తిరువూరులో నిర్వహించిన "రా..కదిలిరా..” బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ, అశేష ప్రజానీకాన్ని ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. తెలుగుదేశం-జనసేన కూటమికి ఓటేయాలని తిరువూరు సభలో చంద్రబాబు పిలుపునిచ్చారు.
తెలుగుదేశం - జనసేన పభుత్వంలో సూపర్ సిక్స్ అమలు చేసి... సకల జనుల సంక్షేమానికి పాటుపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులు, మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు భరోసా కల్పించేలా పథకాలు అమలు చేస్తామన్నారు. తిరువూరు బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.... నాయకులు, శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. సైకో పాలనపై జరుగుతున్న యుద్ధంలో ఓటు ఆయుధంతో ప్రజలు పోరాడితే... 3 నెలల తర్వాత రాష్ట్రానికి స్వర్ణయుగం వస్తుందని చంద్రబాబు అన్నారు.
‘‘ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే.. మరో పక్క అమరావతి వెలవెలబోతోంది. దీనికి కారణం జగన్ రివర్స్ పాలన. ఓ వ్యక్తి వల్ల ఒక రాష్ట్రం.. ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక అసమర్థుడు అధికారంలోకి వస్తే కొంతవరకు నష్టం కలుగుతుంది. దుర్మార్గుడి పాలనలో రాష్ట్రంలో తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఈ రాష్ట్రంలో నాతో సహా అందరూ బాధితులే. అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరుతున్నా.” అని చంద్రబాబు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com