CBN: బీసీ రక్షణ చట్టం తెస్తాం: చంద్రబాబు

CBN: బీసీ రక్షణ చట్టం తెస్తాం: చంద్రబాబు
బీసీల జోలికొచ్చే ధైర్యం కూడా చేయకుండా చేస్తామన్న చంద్రబాబు... జయహో బీసీ సదస్సు ప్రారంభం

బీసీల జోలికొచ్చే ధైర్యం కూడా ఎవరూ చేయటానికి వీల్లేకుండా బీసీ రక్షణ చట్టం తెస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పారు. సమాజంలో సగభాగమైన బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతస్థానాలకు తీసుకెళ్లడమే తన ధ్యేయమని తెలిపారు. జయహో బీసీ సదస్సులతో పార్టీ చేసిన మంచిని ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాలని సూచించిన ఆయన...బడుగులను అణగదొక్కుతున్న జగన్‌ను గద్దె దింపేందుకు కలిసిరావాలని కోరాలని పిలుపునిచ్చారు. బీసీలు బలహీనులు కాదు, బలవంతులనే నినాదంతో పార్టీ కేంద్ర కార్యాలయం NTR భవన్‌లో నిర్వహించిన జయహో బీసీ రాష్ట్రస్థాయి సదస్సులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. NTR, జ్యోతిరావుపూలే విగ్రహాలకు నివాళులర్పించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అన్ని జిల్లాల నుంచి కార్యక్రమానికి బీసీ నేతలు భారీగా తరలి వచ్చారు.


NTR పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకు అండగా ఉంది తెలుగుదేశం ఒక్కటేననని చంద్రబాబు స్పష్టంచేశారు. బీసీ నాయకత్వాన్ని తయారుచేసే రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశమన్న ఆయన...వారిని వేధించిన పార్టీ వైకాపా అని ధ్వజమెత్తారు. వైకాపా హయాంలో 3వందల మంది బీసీలను పొట్టనబెట్టుకున్నారన్న బాబు...అనేక వందలమందిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారని ఆవేదన వ్యక్తంచేశారు.గతంలో తెలుగుదేశం ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, 30కి పైగా పథకాలను రద్దుచేసి బీసీలను ఆర్థికంగా ఎదగకుండా అణగదొక్కారని విమర్శించారు.స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను సైతం తగ్గించి వేలమంది బీసీలకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారన్న చంద్రబాబు...ఇప్పుడు ఇన్‌ఛార్జుల మార్పుల విష యంలోనూ బడుగులకే తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆక్షేపించారు. అధికారంలోకి రాగానే బీసీ రక్షణకు కఠిన చట్టం తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అంతకుముందు మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీసీ సెల్‌ అధ్యక్షుడు కొల్లు రవీంద్ జయహో బీసీ సభ లక్ష్యాలను నేతలకు వివరించారు.వైకాపా మోసాలను ప్రజలకి వివరించి మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం జయహో బీసీ వాహనాలను జెండా ఊపి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు.


మరోవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి... నిజం గెలవాలి యాత్రలో భాగంగా... శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం దవలపేటలో పర్యటించారు. శ్రీకాకుళం చేరుకున్న ఆమెకు..తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. చంద్రబాబు అరెస్టు వార్త విని మరణించిన అసిరినాయుడు కుటుంబాన్ని....... భువనేశ్వరి పరామర్శించారు.బాధిత కుటుంబసభ్యుల యోగక్షేమాలు తెలుసుకొని 3లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం బిల్లమడలో చంద్రబాబు అరెస్టు వార్త విని మనస్తాపంతో మరణించిన.... బర్రి విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శించారు. విశ్వనాథం కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పిన ఆమె...3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story