AP: చంద్రబాబు-పవన్‌కల్యాణ్‌ కీలక భేటీ

AP: చంద్రబాబు-పవన్‌కల్యాణ్‌ కీలక భేటీ
సుమారు మూడున్నర గంటలపాటు చర్చలు..... మేనిఫెస్టో, అభ్యర్థుల చేరికపై చర్చలు

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య మరో కీలక భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రాత్రి దాదాపు మూడున్నర గంటలపాటు వివిధ అంశాలపై పవన్‌-చంద్రబాబు సుదీర్ఘ చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాట్లు, ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలు, మేనిఫెస్టో విడుదల సమయం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. రెండు పార్టీలు ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చంద్రబాబు, పవన్ కలసి పాల్గొనాల్సిన సభలు వంటి అంశాలపైనా విస్తృతంగా చర్చించినట్టు సమాచారం.


తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంక్రాంతి సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్‌న్ని ఉండవల్లిలోని తన నివాసానికి భోజనానికి ఆహ్వానించారు. నాదెండ్ల మనోహర్ తో కలసి గత రాత్రి 7 గంటల సమయంలో చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్..... రాత్రి 10 గంటల 30 నిమిషాల గంటల వరకు అక్కడే ఉన్నారు. కలసి భోజనం చేశారు. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఖాయమైనప్పటి నుంచి రెండు పార్టీల అగ్రనేతలు కలసినప్పుడు పరస్పరం గౌరవ మర్యాదలతో ఆదరించుకుంటున్న తీరు... రెండు పార్టీల కేడర్‌కు సానుకూల సంకేతాలు పంపిస్తోంది. శనివారం కూడా తన నివాసానికి వచ్చిన పవన్, మనోహర్ ను చంద్రబాబు, లోకేశ్ సాదరంగా ఆహ్వానించారు. పవన్ కల్యాణ్‌కు ఎదురెళ్లిన చంద్రబాబు... ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువ కప్పి స్వాగతం పలికారు. లోకేశ్‌ను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మనోహర్‌కు లోకేశ్ పుష్పగుచ్ఛం, శాలువతో సత్కరించారు. చంద్రబాబు ఆయనను ఆత్మీయంగా పలకరించి, స్వాగతం పలికారు. రెండు పార్టీల అగ్రనేతల మధ్య కీలక భేటీ కావడంతో... కీలక ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ...., సమావేశం ముగిశాక... నాయకులెవరూ మీడియాతో మాట్లాడలేదు.


తాజా రాజకీయ పరిణామాలు సహా వివిధ అంశాలపై చంద్రబాబు-పవన్‌ లోతుగా చర్చించారు. భేటీలో చంద్రబాబు, పవన్‌తోపాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియను సాఫీగా కొలిక్కి తేవడంతో పాటు, ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన అభ్యర్థుల పరిస్థితేంటి, ఇతర పార్టీల నుంచి టీడీపీ, జనసేనల్లో చేరేందుకు క్యూ కట్టే నాయకులెవరు, వారిని చేర్చుకునే విషయంలో ఎలాంటి విధానం అనుసరించాలి, వచ్చినవారిలో ఎవరికి టిక్కెట్లు ఇవ్వగలం, మిగతావారిని ఎక్కడ, ఎలా సర్దుబాటు చేయాలి వంటి పలు అంశాలపై ఈ భేటీలో రెండు పార్టీల నేతలు కూలంకషంగా చర్చించారు. వైకాపా ఇప్పటికే మూడు జాబితాల్ని ప్రకటించినoదున... తెదేపా, జనసేన అభ్యర్ధుల్ని ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేయడంపై చర్చ జరిగినట్టు తెలిసింది. అభ్యర్ధుల జాబితాల్ని ఎప్పుడు ప్రకటించాలి? తొలి జాబితాను ఎంత మంది అభ్యర్థులతో విడుదల చేయాలి? రెండు పార్టీల అభ్యర్థులతో కలిపి జాబితాలు ఉమ్మడిగా విడుదల చేయాలా? వంటి పలు అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ఎన్నికల ప్రచార కార్యాచరణపైనా ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగినట్టు సమాచారం. చంద్రబాబు ఇప్పటికే 'రా కదలిరా' అంటూ ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోనూ సభలు నిర్వహిస్తున్నారు. వాటిలో పవన్ ఏ సభల్లో పాల్గొనాలి? ఉమ్మడి మేనిఫెస్టోని ఎక్కడ విడుదల చేయాలి? వంటి అంశాలపై వారు చర్చించినట్టు తెలిసింది. తెదేపా సూపర్ సిక్స్‌కి, జనసేన జోడించిన అంశాల్ని కలిపి ఇప్పటికే రెండు పార్టీలు ఉమ్మడి మినీ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లాయి. దాని పై ప్రజల స్పందనేంటి? ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా తుది మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలేంటి అన్న కోణంలో వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story