TDP-JANASENA: బీసీల దశ, దిశ మార్చేందుకే డిక్లరేషన్‌

TDP-JANASENA: బీసీల దశ, దిశ మార్చేందుకే డిక్లరేషన్‌
బీసీలకు 50 సంవత్సరాలకే పింఛను. నెలకు రూ.4వేలకు పెంపు. పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు... చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ అంతటా జయహో బీసీ సభలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ.... ముగింపు సభను మంగళగిరిలో ఘనంగా నిర్వహించింది. తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ సహా రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలి రాగా ఇదే వేదికపై బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక పది సూత్రాలతో కూడిన బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చంద్రబాబు వివరించారు.జగన్‌ తన సామాజిక వర్గానికి చెందిన కొందరిని నియమించుకుని పెత్తందారి వ్యవస్థను నడుపుతున్నారని మండిపడిన చంద్రబాబు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. బీసీల దశ.. దిశ మార్చడం కోసమే డిక్లరేషన్‌ ప్రకటించామని తెలుగదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెదేపా. బీసీ డిక్లరేషన్‌ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి. వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని డిక్లరేషన్‌ ప్రకటించామని చంద్రబాబు అన్నారు.


అంతకుముందు మాట్లాడిన పవన్..జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షల మంది బీసీ కార్మికుల పొట్టకొట్టారని మండిపడ్డారు. బీసీలకు ఏటా 15 వేల కోట్లు కేటాయిస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 153 బీసీ కులాల అభివృద్ధికి..., రక్షణకు జనసేన అండగా ఉంటుందన్న పవన్‌ కూటమి అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల పిల్లలకు ఆదర్శ పాఠశాలలు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సభలో వైసీపీ నేత, మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు.

డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు..

బీసీలకు 50 సంవత్సరాలకే పింఛను. నెలకు రూ.4వేలకు పెంపు. పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు.

విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరిస్తాం. షరతులు లేకుండా విదేశీ విద్య అమలు.

చట్టసభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం.

అన్ని సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34శాతం రిజర్వేషన్‌.

జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు. దామాషా ప్రకారం నిధుల కేటాయింపు.

సామాజిక న్యాయపరిశీలన కమిటీ ఏర్పాటు.

సబ్‌ప్లాన్‌ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు.

స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10వేల కోట్లు.

చట్టబద్ధంగా కులగణన నిర్వహించి, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.

గురుకులాలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌.

ఏడాదిలో బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం.

రూ.5వేల కోట్లతో ‘ఆదరణ’ పరికరాలిస్తాం.

పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పథకం పునరుద్ధరిస్తాం.

తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో-ఆప్షన్‌ సభ్యులుగా అవకాశం కల్పిస్తాం.

నియోజకవర్గ లేదా మండల కేంద్రాల్లో కామన్‌ వర్క్‌ షెడ్స్‌, ఫెసిలిటేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తాం.

Tags

Read MoreRead Less
Next Story