CID CHIEF: అడుగడుగునా సీఐడీ చీఫ్‌ తడబాటు

CID CHIEF: అడుగడుగునా సీఐడీ చీఫ్‌ తడబాటు
చంద్రబాబే అంతిమ లబ్ధిదారుడని తేల్చే ఆధారాలు లేవని అంగీకారం.. కేసును భూతద్దంలో చూపే యత్నం... విలేకరుల ప్రశ్నలకు నీళ్లు నమిలిన సంజయ్‌

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అంతిమ లబ్ధిదారుడని తేల్చేందుకు ఇంకా పూర్తి ఆధారాలు లేవని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ చీఫ్ సంజయ్ అంగీకరించారు. ప్రాథమిక ఆధారాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు కేసులో చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు సీఐడీ నానా కష్టాలు పడుతోంది. హైదరాబాద్‌లోనూ ప్రెస్‌మీట్‌ పెట్టి, మీడియా ప్రశ్నలకు సమాధానాలివ్వలేక సీఐడీ చీఫ్‌ నీళ్లు నమిలారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా మా వద్ద స్పష్టమైన ఆధారాలేవీ లేవని సీఐడీ చీఫ్‌ సంజయ్‌ పరోక్షంగా అంగీకరించారు. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డితో కలిసి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. మొత్తం మీద అడుగడుగునా తడబాటు సమాధానాల దాటవేత భిన్నమైన వివరణలతో సంజయ్‌ పాత్రికేయ సమావేశం అంతా గందరగోళంగా మారింది.


స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారాన్ని భూతద్దంలో చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సీఐడీ ఈసారి హైదరాబాద్‌ను వేదికగా చేసుకుంది. దర్యాప్తులో ఉన్న కేసు గురించి పోలీసులతోపాటు ప్రభుత్వ న్యాయవాదులు కలిపి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేసు దర్యాప్తు వివరాలు. పోలీసులు మాత్రమే వెల్లడించే వారు. ఆ సంప్రదాయాన్ని కూడా పక్కనపెట్టి తొలిసారి అదనపు అడ్వొకేట్ జనరల్‌ను రంగంలోకి దిపండం చూస్తే రచ్చ చేసేందుకే ప్రాధాన్యమిస్తున్నట్లు అర్థమవుతోంది.

కొత్త విషయం ఏమీలేకపోయినా, కొత్తగా మరేదో చెప్పాలని ప్రయత్నించిన సీఐడీ అదనపు డీజీ సంజయ్ అసలు విషయం అడిగేసరికి నీళ్లు నమిలారు. చంద్రబాబే అంతిమ లబ్ధిదారుడని నిర్ధరించడానికి ఇంకా పటిష్టమైన ఆధారాలు దొరకలేదన్నారు. అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తనకు తెలియదని చేతులెత్తేశారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం చంద్రబాబే అంతిమ లబ్ధిదారు అనడానికి ప్రాథమిక ఆధారాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో జరిగే దర్యాప్తులో పటిష్టమైన ఆధారాలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

CRPC 164 సెక్షన్ కింద సాక్షులు మెజిస్ట్రేట్ ఇచ్చే వాంగ్మూలాలను సాధారణంగా దర్యాప్తు సంస్థలు ఛార్జిషీట్ వేసే వరకు అత్యంత గోప్యంగా ఉంచుతాయి. కానీ దానికి భిన్నంగా సీమెన్స్ నోడల్ అధికారి అమిత్ సెహగల్ ఏం సాక్ష్యం చెప్పారో కూడా మీడియాకు చెప్పేశారు. వాంగ్మూలాలు ఎలా బయట పెడతారని అడగ్గా తాను స్టేట్ మెంట్ చూపలేదని ఆయన ఏం చెప్పారో కోట్ చేశానంటూ నీళ్లు నమిలారు. ప్రేంచందర్ రెడ్డి ప్రమేయంపై విలేకరులు అడగ్గా ఆయన వచ్చే వరకు నిధులు వెళ్లాయని గందరగోళంగా వివరణ ఇవ్వడంతో విలేకరులతో అసహనం వ్యక్తం చేశారు.

Tags

Next Story