అమరావతి పోయింది... స్టీల్ ప్లాంట్ పోయింది... పోర్టులు కూడా పోతాయి: చంద్రబాబు
విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. పెందుర్తి జంక్షన్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన... విశాఖకు పట్టిన శనిని వదిలించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ఏపీలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రం నీ అబ్బ సొత్తా జగన్...? అంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఏ1కు ఎప్పుడూ భూములపైనే ధ్యాస అని ధ్వజమెత్తిన చంద్రబాబు..... విశాఖలో ఏ2 పెత్తనమేంటని ప్రశ్నించారు. ఏపీలో జగన్ ఏబీసీడీ పాలసీతో జంగిల్ రాజ్ తీసుకొచ్చారని... ప్రశ్నించిన నేతల్ని కేసులతో వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. విజయసాయిరెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏ2 అడ్డంగా దొరికిపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖలో రౌడీయిజం చేస్తూ... భూకబ్జాల కోసం ఆఫీసులు పెడతారా...? అని ప్రశ్నించారు. హుద్‌హుద్ సమయంలో ఎంతో కష్టపడ్డామని తెలిపారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నీతి, నిజాయతీకి విశాఖ మారుపేరు అని అన్నారు. తాను మెచ్చిన, తనను మెచ్చిన నగరం విశాఖ అని చంద్రబాబు తెలిపారు. పీలా మహాలక్ష్మినాయుడు, అప్పల నరసింహానాయుడు విశాఖలో టీడీపీని నడిపించిన పెద్దలు అని గుర్తుచేశారు. ఇప్పుడు మేయర్‌గా సేవ చేసేందుకు పీలా శ్రీనివాసరావు ప్రజల ముందుకు వచ్చారని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
వివేకా హత్య కేసు నిందితుల్ని పట్టుకోలేరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ కేసులో అప్పుడు సీబీఐ విచారణ అడిగి.. ఇప్పుడు వద్దంటున్నారని జగన్‌పై మండిపడ్డారు. మద్య నిషేధం పేరుతో వేల కోట్ల రూపాయలు నొక్కేశారని ధ్వజమెత్తారు. అమరావతి పోయింది.. స్టీల్ ప్లాంట్ పోయింది.. పోర్టులు కూడా పోతాయని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com