Air services from Kadapa: కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరించాలి: చంద్రబాబు

Air services from Kadapa:  కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరించాలి: చంద్రబాబు
Air services from Kadapa: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్‌కు లేఖ రాశారు.

Air services from Kadapa: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. జగన్ సొంత జిల్లా కడపలోని విమానాశ్రయానికి పూర్వ వైభవాన్ని కల్పించాలంటూ కోరారు. కడప నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులు పునరుద్దరించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉడాన్ పథకాన్ని వినియోగించుకోవాలని లేఖలో సూచించారు. కడప నుంచి విమాన సర్వీసులు అందుబాటులో లేకపోవడం వల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారని, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి విమాన సర్వీసులు అత్యవసరమని గుర్తు చేశారు.

కడప ఎయిర్ పోర్ట్‌లో విమానాలు నిలిచిపోవడం, రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోవడం వల్ల పెట్టుబడిదారులు పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు రాలేరని చంద్రబాబు చెప్పారు.

తమ ప్రభుత్వ హయాంలో ఉడాన్ పథకాన్ని వినియోగించుకుని.. కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామన్నారు. అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ ఎయిర్‌పోర్ట్ ఒక్కటే మార్గమని గుర్తు చేశారు.

దేశవ్యాప్తంగా టయర్-2, టయర్-3 నగరాలకు విమాన సర్వీసులను నడిపించడానికి కేంద్రం ఉడాన్ పథకాన్ని అమలు చేసిందని, దీన్ని వినియోగించుకుని.. పొరుగు రాష్ట్రాల రాజధానులకు తాము ఫ్లయిట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

కొద్దిరోజులుగా ఈ ఎయిర్ పోర్ట్‌లో విమాన సర్వీసులు స్తంభించిపోవడం వల్ల వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఎయిర్ కనెక్టివిటీ లేకుండా పోయిందన్నారు చంద్రబాబు. దీన్ని వెంటనే వినియోగంలోకి తీసుకుని రావాలని సూచించారు.

కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పిన తరువాత.. కడప విమానాశ్రయానికి పారిశ్రామికవేత్తల తాకిడి పెరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కడప నుంచి విజయవాడకు రోడ్ కనెక్టివిటీతో పాటు ఎయిర్ కనెక్టివిటీని మరింత మెరుగుపర్చాలంటూ లేఖలో సీఎం జగన్‌ను కోరారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story