AP HIGH COURT: చంద్రబాబుపై కేసు ప్రతీకారమే: హరీశ్‌ సాల్వే

AP HIGH COURT: చంద్రబాబుపై కేసు ప్రతీకారమే: హరీశ్‌ సాల్వే
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో హరీశ్‌ సాల్వే వాదనలు... అరెస్ట్‌లో నిబంధనలు పాటించలేదన్న సాల్వే

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం దర్యాప్తు నిర్వహించడం, అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపడం చెల్లదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు హాలు న్యాయవాదులతో కిక్కిరిసిపోయింది. మంగళవారం ఉదయం 12 గంటలకు ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం భోజన విరామ సమయం మినహాయించి...... సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌సాల్వే ఆన్‌లైన్‌ ద్వారా మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.


తొలుత చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో FIRపై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో మాత్రమే వేశారని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌-17A కింద తగిన అనుమతులు తీసుకోలేదన్నారు. ఈ FIR చట్టవిరుద్ధమన్నారు. గతంలో ఇచ్చిన తీర్పులను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారని, సెక్షన్‌ 17A పూర్తి వివరాలు తెలిసినా చంద్రబాబు అరెస్టుకు గవర్నర్‌ అనుమతి తీసుకోలేదని గుర్తుచేశారు. నేరం ఎప్పుడు జరిగిందన్నది కాకుండా దర్యాప్తు సమయంలో ఉన్న చట్టబద్ధతను పరిగణించాలన్నారు. కేసు పెట్టేందుకు మూలమైన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సెక్షన్‌ 17A వర్తిస్తుందని, స్కిల్‌ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందున ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టంచేశారు. ఇప్పుడు పదవిలో లేనందున ఆ నిబంధన వర్తించదనడం చట్టబద్ధంగా చెల్లుబాటు కాదన్నారు.


పాత ప్రభుత్వంపై కొత్త ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడకుండా చట్టంలో ఈ నిబంధన పొందుపరిచిన విషయాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబుపై నమోదైన కేసును రాజకీయ ప్రతీకార కేసుగానే పరిగణించాలని సాల్వే అన్నారు. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతున్నందున ఈ కేసును ఏకపక్షంగా చూడకూడదన్నారు. ఇక్కడే హైకోర్టు తన విచక్షణాధికారాన్ని వినియోగించాలని కోరారు. ఇదే కేసుకు సంబంధించిన G.S.T ఫిర్యాదులను హైకోర్టు పరిశీలించిందన్నారు. ఈ కేసుకు ఆధారమైన ప్రాజెక్టు ఖర్చులో 90 శాతం ప్రైవేటు సంస్థలు, 10 శాతం మాత్రమే ప్రభుత్వం భరిస్తుందని, యువతలో సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకే ప్రాజెక్టు చేపట్టారని గుర్తుచేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మదింపు నివేదికను హరీశ్ సాల్వే చదివి వినిపించారు. నగదు అంశం మాత్రమే ప్రభుత్వానికి సంబంధించినదని మిగతావన్నీ ప్రైవేటు సేవలేనని గుర్తుచేశారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన భూమి, అనుమతులతోపాటు 330 కోట్లు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారని ఇది ప్రాజెక్టు విలువలో దాదాపు 10 శాతానికి సమానమని వివరించారు. మొత్తం ప్రాజెక్టులో...... రాష్ట్ర భాగస్వామ్యం చాలా స్వల్పమని, ప్రైవేటు సంస్థలదే అధిక బాధ్యతన్నారు. ఒప్పందం తర్వాత ఎవరేం చేయాలనే దానిపైనా అంగీకారపత్రం తీసుకున్నారని, ఆ మేరకు ప్రతిపాదించిన ప్రాజెక్టు పూర్తయ్యాక..... ప్రభుత్వానికి అందించారని సాల‌్వే వాదించారు. తమ అనుబంధ సంస్థే స్కిల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీమెన్స్‌ స్పష్టంచేసిందన్న సాల్వే వాటిని పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించాక ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story