AP HIGH COURT: చంద్రబాబును కేసులో ఇరికించారు: సిద్ధార్థ లూథ్రా

AP HIGH COURT: చంద్రబాబును కేసులో ఇరికించారు: సిద్ధార్థ లూథ్రా
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో హైకోర్టులో లూథ్రా వాదనలు... ప్రజా సమస్యలపై పోరాడుతున్నందునే కేసు పెట్టారన్న లూథ్రా..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేతపై ప్రస్తుత ప్రభుత్వం ప్రతీకారం తీసుకునేందుకు కేసు నమోదు చేసిందని చంద్రబాబు తరఫున మరో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. పిటిషనర్‌ దేశం విడిచి వెళ్లేవారేమీ కాదన్నారు. నిజంగా దేశం విడిచి వెళ్లేటట్లయితే ప్రాసిక్యూషన్‌ ఈ కేసును ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. పిటిషనర్‌ అడ్డంకిగా లేకుండా ఉండాలనేది ప్రభుత్వ అంతిమ ఉద్దేశమన్నారు. ప్రతిపక్షనేతగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు ఆయనను ఈ కేసులో ఇరికించారని సిద్ధార్థ లూథ్రా వాదించారు.


2021లో ఫిర్యాదు నమోదైందని, కేసులో అన్ని పరిణామాలు ఆ తర్వాతే జరిగాయని సిద్దార్థ లూథ్రా వాదించారు. ప్రభుత్వ వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, ఒకసారి దర్యాప్తు ప్రారంభ దశలో ఉందంటున్నారని, మరోసారి దర్యాప్తు 2018లోనే ప్రారంభమైందంటున్నారని తెలిపారు. నాలుగున్నరేళ్లు ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు వచ్చి డాక్యుమెంట్లు కనబడటం లేదంటారని కేసుకు సంబంధించిన ఫైళ్లను ధ్వంసం చేసి. పిటిషనర్‌పై నిందారోపణలు చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. ఏపీ ప్రభుత్వంలో పద్ధతి ప్రకారం పత్రాలు కనబడకుండా పోతున్నాయని చెప్పారు.


అనినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17A నిబంధనలను అనుసరించి గవర్నర్‌ అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేయడం చెల్లదని పిటిషనర్‌ 2018 జులై 26 నుంచి సెక్షన్‌ 17A అమల్లో ఉందని లూథ్రా గుర్తు చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ విషయంలో 2021 డిసెంబర్‌ 9న కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. టీడీపీ అధినేతను 2023 సెప్టెంబర్‌ 8న నిందితుడిగా చేర్చారన్నారు. 17ఏ నిబంధన ప్రకారం గవర్నర్‌ నుంచి అనుమతి పొందకుండానే నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారన్నారు. ఈ విషయాన్ని ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకోకుండా జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. నేర ఘటన 2018కి పూర్వం చోటు చేసుకున్నందున సెక్షన్‌ 17ఏ పాటించాల్సిన అవసరం లేదన్న సీఐడీ వాదన సరికాదని లూథ్రా వాదించారు.

Tags

Next Story