దేశం బాగుండాలి.. తెలుగువారు అగ్ర జాతిగా ఉండాలి - చంద్రబాబు

దేశం బాగుండాలి.. తెలుగువారు అగ్ర జాతిగా ఉండాలి - చంద్రబాబు
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనుకున్నాం


విజన్‌.... ఈ మాట వింటే ఠక్కున గుర్తొచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఆయన రూపొందించిన విజన్‌-2020 మెరుగైన ఫలితాలనిచ్చింది. అప్పట్లో విజన్‌-2020పై రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే... అది మంచి ఫలితాలు ఇవ్వడంతో విమర్శించినవారి నుంచే ప్రశంసలూ వచ్చాయి. ఇక... రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కి విజన్‌-2029 డాక్యుమెంట్‌ను రూపొందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు పటిష్ఠమైన ప్రణాళికలు వేశారు. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు భారతదేశాన్ని అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిష్కరించే లక్ష్యంతో పంచ వ్యూహాలతో విజన్‌-2047 డాక్యుమెంట్‌ సిద్ధం చేశారు. ఆయన నెలకొల్పిన గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌..... ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించింది. జీఎఫ్‌ఎస్‌టీ ఛైర్మన్‌ హోదాలో ఈ డాక్యుమెంట్‌ను విశాఖలో ఆవిష్కరించారు చంద్రబాబు.

ప్రపంచానికి నాయకత్వం వహించే శక్తిని సంపాదించుకోవడానికి ఐదు లక్ష్యాలను పెట్టుకుని పనిచేస్తే ...2047 నాటికి ప్రపంచంలో భారత్‌ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు చంద్రబాబు. భారతదేశం బాగుండాలి..... అందులో తెలుగువారు అగ్రజాతిగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు చంద్రబాబు. ప్రపంచానికి తెలుగువాళ్లే సేవలందించి ఏపీని అగ్రస్థానంలో నిలపాలన్నారు. పేదరికం లేకుండా ఆర్థిక అసమానతలు పోవాలన్న ఆయన...అదే తన ముందున్న లక్ష్యమన్నారు. ఇందుకోసమే విజన్‌-2047 రూపొందించినట్లు తన ప్రజెంటేషన్‌లో వెల్లడించారు చంద్రబాబు.

విజన్‌ -2047 డాక్యుమెంట్లో ఐదు వ్యూహాలతో.. తీర్చిదిద్దారు చంద్రబాబు. ఇందులో మొదటిది... గ్లోబల్‌ ఎకానమీగా భారత ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దడంపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. గ్లోబల్‌ సిటిజన్లుగా భారతీయులు మారాలని.... అందులోనూ తెలుగువారు ప్రపంచ దేశాల్లో వివిధ రంగాల్లో అద్భుత విజయాలు నమోదు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఐటీ వంటి రంగాల్లో దూసుకుపోతున్నారు. అంతర్జాతీయంగా భారత నాయకత్వ స్థాయిని పెంచేందుకు ఇదే సరైన సమయం అన్నది విజన్‌ డాక్యుమెంట్‌ ఉద్దేశమన్నారు. ఇక రెండో వ్యూహంగా సంక్షేమానికి నమూనాగా పీపుల్‌-పబ్లిక్‌-ప్రైవేట్‌-పార్టనర్‌షిప్‌ - P4 అమలు చేయాలన్నారు చంద్రబాబు. యువత జనాభా ఎక్కువగా ఉండటం భారతదేశానికి వరమన్న ఆయన... . దీన్ని అవకాశంగా అందిపుచ్చుకుని అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కాలన్నారు.

ఇక శాస్త్ర సాంకేతికత, పరిశోధన, వినూత్న ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు చంద్రబాబు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు-భావి నిర్దేశిత శాస్త్ర సాంకేతికత బదిలీ జరగాలన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని.... పోటీతత్వం, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఎకో సిస్టమ్‌ ఉండాలన్నారు. స్టార్టప్‌ సంస్థల ద్వారా భవిష్యత్తు ఉద్యోగాల కల్పన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించాలన్నారు. స్టార్టప్స్‌ హబ్స్‌తో అత్యున్నత చోదకశక్తి ఆవిర్భావానికి కృషి చేయాలన్నారు. ఇక ఇంధన సమృద్ధ దేశంగా భారత్‌ అభివృద్ది చేయాలన్నారు చంద్రబాబు. 2030 నాటికి 500 గిగా వాట్స్‌ నాన్‌ ఫాజిల్‌ ఇంధన సామర్థ్యం సాధన లక్ష్యం కావాలన్నారు చంద్రబాబు. ఇంధన వినియోగంలో భౌగోళిక వైవిధ్యం, క్లీన్‌ కుకింగ్‌కు యాక్సిస్‌ బదిలీ చేయాలని ఈ డాక్యుమెంట్‌లో వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఎనర్జీ ఉత్పాదన వార్షిక వృద్ధి కనిష్ఠంగా 5 ఎంఎంటీ ఉండేలా లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.

ఇక.. చివరి వ్యూహంగా జల సమృద్ధ దేశంగా భారత్‌ను అభివృద్ధి చేయాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా నీటి నిర్వహణ వ్యవస్థలో నియంత్రణ రావాలన్నారు. అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా నీటి విడుదల జరగాలని.... నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలన్నారు. కొత్త ప్రాజెక్టు నిర్మాణం, పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ఈ డాక్యుమెంట్లో పేర్కొన్నారు. కొన్నిచోట్ల కరవు, మరికొన్ని ప్రాంతాల్లో వరదల నేపథ్యంలో వీటిని అధిగమించడానికి నదుల అనుసంధానమే పరిష్కారమని తెలిపారు. దీన్ని సాధించాలంటే రాష్ట్రాల భాగస్వామ్యంతో సమర్థమైన నేషనల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయాలన్నారు. ఇక... ఏపీలో గోదావరి-కృష్ణా, పెన్నా-కావేరీ నదుల అనుసంధానం జరగాలని సూచించారు. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీటిని కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించాలని.... భూగర్భ జలాల పెంచాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story