CBN: అక్రమార్కులను జైలుకు పంపుతాం

CBN: అక్రమార్కులను జైలుకు పంపుతాం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరిక.... చట్టబద్ధంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచన

వైసీపీ హయంలో అడ్డూ అదుపు లేకుండా ఓటర్ లిస్ట్ మారుస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. చంద్రగిరిలో దొంగ ఓట్లు తొలగించాలని ఆందోళనకు దిగి పెట్రోల్ పోసుకోవడంతో అనారోగ్యం పాలైన పులవర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు. దొంగ ఓట్లు చేర్పించి తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తీసేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ మండిపడ్డా వెసీపీ నాయకుల్లో మార్పు రాలేదన్నారు. చంద్రగిరిలో అవకతవకలపై తిరుపతి కలెక్టర్‌కు ఈసీ చీవాట్లు పెట్టిందని గుర్తుచేశారు. పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడులోనూ దొంగ ఓట్లు చేర్చారని కొన్నిచోట్ల ఏకంగా పోలింగ్ బూత్ లే మార్చేశారన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని కోర్టులో కేసులు వేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.


అంతకుముందు నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. గ్రామదేవతలు సత్తెమ్మ, నాగాలమ్మ అమ్మవార్లకు చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు. NTR విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు.


ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే టీడీపీ పోరాటం చేస్తోందని చంద్రబాబు అన్నారు. 40 ఏళ్లుగా నేను ఈ జిల్లాను చూస్తూ వస్తున్నానని... ఏన్నడూ లేనంతగా మనీ పవర్‌, భూకబ్జాలు, దోచుకోవడం లాంటివి ఇప్పుడు చూస్తున్నాని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలా దోచుకున్న డబ్బును తీసుకొచ్చి యథేచ్ఛగా పంపిణీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఇకపై ఇలాంటివి జరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిర్ణయించుకున్నారని... వైసీపీని ఇంటికి పంపడం ఖాయమని తెలిపారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. అధికారులకూ ఇదే తమ హెచ్చరిక అని చంద్రబాబు అన్నారు. చట్ట ప్రకారం విధులు నిర్వర్తించాలని.... చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తానంటే మాత్రం ఊరుకోబోమన్నారు. అక్రమాలకు పాల్పడుతోన్న అధికారుల ప్రవర్తనపై కేంద్ర ఎన్నికల సంఘం, డీవోపీటీకి పూర్తి వివరాలు అందిస్తామన్నారు. వారు చేసిన అక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలు ఆధారాలతో సహా కోర్టుకు సమర్పిస్తామని చంద్రబాబు తెలిపారు. ఎవరినీ వదిలిపెట్టబోమని.. తప్పు చేసిన వారిని జైలుకు పంపించేవరకు ఊరుకోబోమన్నారు. అంగన్వాడీలు, ఉద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్న చంద్రబాబు... టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story