CBN: జగన్ వ్యాఖ్యల వల్లే ఈ దాడులు: చంద్రబాబు

బహిరంగ సభల్లో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యల కారణంగానే వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయి పాత్రికేయులు, పత్రికా కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చొక్కా చేతులు మడతపెట్టండని హింసను ప్రేరేపించేలా జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల్ని అడ్డుకోవడం, నిందితుల్ని పట్టుకొని కఠిన శిక్షలు పడేలా చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తన అవినీతిని ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లను లక్ష్యంగా చేసుకొని జగన్ పదేపదే బురదజల్లుతున్నారని మండిపడ్డారు. పోలీసుల్ని ప్రయోగించి ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని, వారిని తన దారికి తెచ్చుకోవాలనే ఇలా చేస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో విలేకర్లు, మీడియా సంస్థలపై జరిగిన దాడుల్ని ప్రస్తావిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. దాడులకు బాధ్యుడైన జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
జగన్ సీఎం అయినప్పటి నుంచీ పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలు ప్రారంభమయ్యాయని లేఖలో చంద్రబాబు అన్నారు. వైసీపీ ఇసుక మాఫియాను వెలుగులోకి తెచ్చారనే కోపంతో అమరావతి మండల ‘న్యూస్‌టుడే’ విలేకరి పరమేశ్వరరావుపై ఈ నెల 14న హత్యాయత్నం చేశారని చంద్రబాబు ప్రస్తావించారు. 18న రాప్తాడు ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ కృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశారని అన్నారు. వైకాపా ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి అరాచకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని కర్నూలు నగరంలోని ‘ఈనాడు’ కార్యాలయంపై ఆయన అనుచరులు మంగళవారం దాడి చేసి, గంటసేపు భీతావహ వాతావరణం సృష్టించారని అన్నారు. వైసీపీ సభను కవర్ చేసేందుకు వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరి వీరశేఖర్‌పై దాడి జరిగిందని గుర్తు చేశారు. ఈ దాడి ఘటనలపై వేగంగా దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకునేలా పోలీసుల్ని ఆదేశించాలని కోరారు. ఈ లేఖ ప్రతులను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులకు పంపుతున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు ప్రజల్లో జనసేనపై అభిమానం ఉందని దాన్ని ఓటుగా మార్చేందుకు ఈ క్షణం నుంచే పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున అంతా ఐక్యంగా ముందుకెళ్లాలని జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. అప్రజాస్వామిక, ఫ్యాక్షన్ ధోరణితో వెళ్తున్న సీఎం జగన్‌ను అడ్డుకోవాలంటే తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని తూర్పుగోదావరి జిల్లా నేతలకు స్పష్టంచేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, అనపర్తి, రాజానగరం నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ముఖ్యనాయకులతో మంగళవారం పవన్ సమావేశమయ్యారు. జనసేనను స్థాపించిన తరవాత పార్టీని ఈ స్థాయికి తెచ్చే క్రమంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, అవమానాల గురించి వివరించారు. జనసేన ఒంటరిగా పోటీచేయాలని, ఎక్కువ స్థానాలు డిమాండ్ చేయాలని అనేక సూచనలు వస్తున్నాయన్న పవన్...అలా చేస్తే 40 స్థానాల్లో గెలిచే బలం జనసేనకు ఉందన్నారు. అందుకు సమర్థ ఎలక్షనీరింగ్ చేసే అభ్యర్థులు ఉండాలని ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసి తీసుకుని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే వైకాపాకు లబ్ధి చేకూరుతుందని నేతలకు వివరించారు. మరో దఫా వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అస్తవ్యస్తమవుతుందన్న పవన్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశంతో పొత్తు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com