SC: సుప్రీంకోర్టులో జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ

SC: సుప్రీంకోర్టులో జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఊరట... ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు

అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో జగన్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ 17A నిబంధన వర్తిస్తుందా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవేళ వర్తిస్తే తదుపరి ఏం చేస్తారని జగన్‌ ప్రభుత్వాన్ని అడిగింది. ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ రద్దును కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.


2022లో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుపై S.L.P దాఖలైందని, ఈ కేసులో కూడా 17A నిబంధన వర్తిస్తుందా అని ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయంతో ఇచ్చిన తీర్పునకు, ఈ కేసుకూ సంబంధం ఉందా అని అడిగింది. ఒకవేళ 17A వర్తిస్తే తదుపరి ఏం చేస్తారని ప్రభుత్వానికి కోర్టు ప్రశ్నలు సంధించింది. పలు I.P.C సెక్షన్లు కూడా... ఇందులో ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు వివరించారు. అయితే ఈ కేసులో సెక్షన్ 420 ఎలా వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం నిలదీసింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసుల వివరాలను ధర్మాసనం తీసుకుంది. ఈ సందర్భంగా పలు ధర్మాసనాల ముందు ఉన్న కేసుల వివరాలు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా అందించారు.

అన్ని వివరాలను పరిశీలించిన ధర్మాసనం మిగతా కేసుల్లో సాధారణ బెయిల్‌ కూడా మంజూరైంది కదా అని అడిగింది. కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్, కొన్నింటిలో ముందస్తు బెయిల్‌ వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇదే కేసులో సహనిందితులు బెయిల్‌పై ఉన్నప్పుడు.... చంద్రబాబు కూడా బయట ఉంటే నష్టమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల తరువాత ప్రభుత్వం మారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు కుమారుడు ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని... ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అలాంటివి ఏమైనా ఉంటే కోర్టులు చూసుకుంటాయని... ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా కనిపించడం లేదన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా 2022లో ఇదే వ్యవహారంపై S.L.Pలో ఇచ్చిన ఉత్తర్వులే... అమల్లో ఉంటాయన్నారు. ఒకవేళ నిందితులు దర్యాప్తునకు సహకరించకపోతే సంబంధిత కోర్టులను ఆశ్రయించి బెయిల్‌ రద్దు కోరవచ్చని ధర్మాసనం సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story