TDP-JANASENA: మరోసారి చంద్రబాబు- పవన్ భేటీ!

TDP-JANASENA: మరోసారి చంద్రబాబు- పవన్ భేటీ!
సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం... తెలుగుదేశం-జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై మరోవిడత చర్చలు

తెలుగుదేశం-జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు ఇరుపార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు-జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న ఇద్దరూ అతిత్వరలో మరోసారి సమావేశం కానున్నట్లు తెలిసింది. వచ్చే 2-3 రోజులు సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఖరారుపై చర్చించనున్న చంద్రబాబు....... రా..! కదలి రా..!! సభలకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాల్లో రా..! కదలి రా..!! సభలు పూర్తిచేసిన ఆయన ఫిబ్రవరి 4నుంచి మిగిలిన చోట్ల నిర్వహిస్తారని... ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఫిబ్రవరి 4న అనకాపల్లి నుంచి పవన్ పర్యటనలు ప్రారంభిస్తారని ఇప్పటికే జనసేన సంకేతాలు ఇచ్చింది.


మరోవైపు అధికార వైసీపీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి కొన్నాళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్న సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకష్ ని కలిశారు. ఈ మధ్యాహ్నం తన కుమారుడితో కలిసి లోకేష్ వద్దకు వచ్చిన ఆదిమూలం తెలుగుదేశంలో చేరే అంశంపై చర్చించారు. ఇటీవలే వైకాపా సహా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆదిమూలం తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా ఏళ్ల నుంచి సత్యవేడులో పనిచేస్తున్న తనను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంలో పెద్దిరెడ్డి కుట్ర ఉందని మండిపడ్డారు. ఎస్సీలకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా సీట్లు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఇసుక, మట్టి సహా అన్నిరకాలుగా దోపిడీ చేసి.. అవన్నీ తనపైకి తోశారని ఆదిమూలం వాపోయారు.

బాలినేని షాక్‌ తప్పదా


వరుసగా నేతలు ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయం... రసవత్తరంగా మారింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించే యోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఒంగోలు అసెంబ్లీ సీటును మాజీమంత్రి బాలినేనికి తిరస్కరించినట్లు తెలిసింది. బాలినేనిని గిద్దలూరు వెళ్లాలని వైసీపీ సూచించినట్లు తెలుస్తోంది. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డికి ఒంగోలు లోక్ సభ సీటు కూడా ఇచ్చేది లేదని సీఎం జగన్ చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామంపై అసంతృప్తిగా ఉన్న బాలినేని ఎంపీ విజయసాయిరెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఒంగోలు పంచాయితీపై తాడేపల్లిలో సీఎం వద్ద చర్చ జరిగే అవకాశముందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story