CBN: ఉత్తరాంధ్ర ద్రోహీ జగన్‌

CBN: ఉత్తరాంధ్ర ద్రోహీ జగన్‌
నెల్లిమర్లలో చంద్రబాబు ఆగ్రహం.... ప్రతి మండలానికి ఒక ఆసుపత్రి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్న పవన్‌..

ప్రజాగళం సభల్లో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటించారు. నెల్లిమర్ల జనసేన అభ్యర్థి మాధవి, స్థానిక లోక్‌సభ అభ్యర్థి తెలుగుదేశం నేత కలిశెట్టి అప్పలనాయుడిని గెలిపించాలని ఇరువురు కోరారు. జగన్‌ ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలారని చంద్రబాబు ఆరోపించారు. తాను తెచ్చిన ఒక్క పరిశ్రమ, ప్రాజెక్టు పేరును జగన్‌ చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి సభలకు వస్తున్న స్పందన చూసి.. వైసీపీ నేతల్లో ఆందోళన పెరుగుతోందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తారకరామతీర్థ సాగర్‌ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయాన్ని 2025 కల్లా పూర్తిచేస్తామన్న చంద్రబాబు నెల్లిమర్ల అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా తయారవుతుందన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో నాటకం ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందని చంద్రబాబు దుయ్యబట్టారు.


కరెంట్ బిల్లులు తగ్గాలంటే మే13 న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ సూచించారు. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా దోపిడీ చేస్తున్న జగన్‌.. క్లాస్‌వార్‌ అంటూ యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నెల్లిమర్ల ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం ప్రతి మండలానికి ఒక ఆసుపత్రి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ప్రజల కన్నీరు తుడవాలనేదే తమ ప్రయత్నమని పవన్ వివరించారు. అంతకుముందు శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు సమర్థ ప్రభుత్వం ఉంటేనే ప్రజల జీవితాలు బాగుపడతాయన్నారు. జగన్‌ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తామని చెప్పారు.

ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్‌ అని చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు టీడీపీ పుట్టినిల్లు అని చెప్పారు. తాను మొదటి నుంచి మహిళా పక్షపాతినని తెలిపారు. మీ కుటుంబాలకు పెద్దకొడుకులా సేవ చేస్తానన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వివరించారు. ‘‘ఎన్నికలకు నేటి నుంచి 19 రోజులు మాత్రమే ఉంది. మే 13న వైసీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి. అసమర్థ చేతకాని ప్రభుత్వంలో అన్నీ ఇబ్బందులే. సమర్థ ప్రభుత్వం, నాయకత్వం ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయి. మేం అధికారంలోకి వచ్చాక ‘అమ్మకు వందనం’ కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే నా లక్ష్యం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తాం.. వడ్డీ లేని రుణాలు అందిస్తాం. స్థలాలు లేని వారికి 2, 3 సెంట్లు భూమి ఇప్పించి గృహాలు నిర్మిస్తాం. పెంచిన రూ.4 వేల పింఛన్లను ఏప్రిల్‌ నుంచే ఇస్తాం. దివ్యాంగులకు రూ.6 వేలు అందిస్తాం. పింఛన్ల పేరుతో ఈ ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తోంది. జగన్‌ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుంది. అప్పులు తెచ్చి బటన్‌ నొక్కడం గొప్ప కాదు. సంపద సృష్టించే, ఉద్యోగాలు కల్పించే వాళ్లు నాయకులు. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్‌.. ఏం చేశారని ఇక్కడికి వస్తున్నారు? ఒక్క ప్రాజెక్టయినా కట్టారా? ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చారా? ఏమీ చేయకుండా ప్రజలకు కథలు చెప్పడానికి వస్తున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Tags

Read MoreRead Less
Next Story