టీడీపీ నేత దారుణ హత్య.. మృతుడి భార్యకు ఫోన్‌ చేసి ఓదార్చిన చంద్రబాబు

టీడీపీ నేత దారుణ హత్య.. మృతుడి భార్యకు ఫోన్‌ చేసి ఓదార్చిన చంద్రబాబు
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డి ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్యయ్య దారుణ హత్యపై టీడీపీ భగ్గుమంది. హత్య విషయం తెలియగానే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నాయకులకు ఫోన్‌ చేసి హత్య సంఘటన వివరాలు తెలుసుకున్నారు. మృతుడి భార్య అపరాజితకు ఫోన్‌ చేసి ఓదార్చారు. సుబ్బయ్య కుటుంబానికి, పిల్లలకు టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హత్య చేసిన నిందితులకు శిక్ష పడేవరకు పార్టీ పోరాడుతుందన్నారు చంద్రబాబు.

బుధవారం సుబ్బయ్య అంత్యక్రియల్లో నారా లోకేశ్‌ పాల్గొంటున్నారు. లోకేశ్‌తో పాటు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, జిల్లా టీడీపీ నాయకులు హాజరు కానున్నారు.

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారురెడ్డి ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించారు. ప్రొద్దుటూరులో ఇంటి పట్టాలు అర్హులకు అందడం లేదంటూ మున్సిపల్‌ కమిషనర్‌ రాధకు ఫిర్యాదు చేశారని, కాసేపటికే తన భర్త కళ్లలో వైసీపీ వర్గీయులు కారం చల్లి.. ఆపై రాడ్డుతో తలపై కొట్టి దారుణంగా హతమార్చారని మృతుడి భార్య అపరాజిత ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా రాచమల్లు కుటుంబానికి తన భర్త సేవలు చేశారని, అలాంటి వ్యక్తిని హత్య చేయించడానికి వారికి మనసెలా వచ్చిందని అపరాజిత ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను హత్య చేయించిన ఎమ్మెల్యే, ఆయన బావమరిదిని శిక్షించాలని, అప్పుడే తనకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరిదిపై చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.

ఐదు రోజుల క్రితం తిరుమల వెళ్లిన నందం సుబ్బయ్య.. అక్కడి నుంచి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ సోషల్‌ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేశారని, రెండు రోజుల కింద ఇసుక అక్రమాలపై మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో నందం సుబ్బయ్యను హత్య చేయడం కలకలం రేపింది. వాస్తవానికి సుబ్బయ్య రాచమల్లుకు ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. 2014 స్థానిక ఎన్నికల్లో ప్రొద్దుటూరు ఎంపీపీ సీటు ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరారు. ఈమధ్యే టీడీపీ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. ప్రొద్దుటూరులో పట్టాల మంజూరులో పేదలకు అన్యాయం జరుగుతోందన్న సుబ్బయ్య.. ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు కనిపించేలా సెల్ఫీ తీసుకుని.. కడప జిల్లా వార్తలు అనే వాట్సాప్‌ గ్రూపులో శుభోదయం అని పెట్టారు. అలా మెసేజ్‌ పెట్టిన 15 నిమిషాల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కళ్లలో కారం చల్లి.. తలపై ఇనుప రాడ్లతో దాడి చేసి అతి కిరాతంగా హతమార్చారు.


Tags

Read MoreRead Less
Next Story