కుప్పంలో ఓడింది నేను కాదు.. ప్రజాస్వామ్యం : చంద్రబాబు

కుప్పంలో వైసీపీ అరాచకాల కారణంగా ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు చంద్రబాబు. ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. కుప్పంలో కోట్లు పెట్టి ఓట్లు కొంటుంటే ఎన్నికల కమిషన్ ఏ చర్యలు తీసుకుందని ప్రశ్నించారు.
అవినీతి డబ్బుని వెదజల్లి పంచాయతీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. మొదటి విడతలో 38 శాతం, రెండో విడతలో 39 శాతం, మూడో విడతలో 40 శాతం టీడీపీ గెలుచుకుందన్నారు. వాలంటీర్లను ఉపయోగించుకుని సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని ఓటర్లను భయపెట్టారన్నారు. కోర్టు చెప్పినట్టు ఎన్నికల సంఘం కౌంటింగ్‌ను ఎందుకు రికార్డ్ చేయలేదని ప్రశ్నించారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు చంద్రబాబు. టీడీపీ బలపరిచిన అభ్యర్ధుల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఏలూరులో చేపల చెరువులో విష ప్రయోగం, జేసీబీతో ఇంటి మెట్లు కూలగొట్టడం, గడ్డివాములు తగలబెట్టడం వంటి అరాచకాలెన్నింటినో చేసిందని విమర్శలు గుప్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com