కేంద్ర బలగాలతో ఆ మూడు చోట్ల ఎన్నికలు నిర్వహించాలి : చంద్రబాబు

కేంద్ర బలగాలతో ఆ మూడు చోట్ల ఎన్నికలు నిర్వహించాలి : చంద్రబాబు
పెద్దిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి విషయంలో గవర్నర్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తీరుపై తెలుగుదేశం సీరియస్‌ అయింది. రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాయాలని నిర్ణయించింది. ఏ అధికారి అయినా అధికార దుర్వినియోగం చేస్తే వదిలిపెట్టబోమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారికి శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు.

బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ తెర లేపిందన్న చంద్రబాబు.. పోలీస్ వ్యవస్థ మొత్తం ఏకగ్రీవాలపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్ని 24 గంటలూ పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలని అన్నారు. పెద్దిరెడ్డి విషయంలో గవర్నర్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. అక్రమాల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఎన్నికలు ఐపోతే చాలని.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎస్‌ఈసీ ఒక రెఫరీగా ఉండాలని సూచించారు. చట్టంలోని నిబంధనల్ని ఎస్‌ఈసీ అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.

పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో ఎన్నికలు నిలిపివేసి.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ మూడు ఏరియాల్లో కేంద్ర బలగాలతో మూడు చోట్ల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మాచర్ల లో 77 పంచాయతీలుంటే 76 ఏకగ్రీవాలు చేశారని వివరించారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల తీరుపై హైకోర్టులో పిల్ వేశామని చంద్రబాబు.. పిటిషన్‌ శుక్రవారం విచారణకు రానుందని చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story