CBN: నరహంతకులను వదిలిపెట్టను

CBN: నరహంతకులను వదిలిపెట్టను
కోవర్టులతో టీడీపీ-జనసేన పొత్తును దెబ్బతీయలేరు... దాచేపల్లి సభలో చంద్రబాబు హెచ్చరిక

పల్నాడు జిల్లాలో తమ కార్యకర్తలను చంపిన నరహంతకులను వదిలిపెట్టేదిలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. మంచికి మంచి దెబ్బకు దెబ్బ ఉంటుందని తేల్చి చెప్పారు. తెలుగుదేశం, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టి తనకు, పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు సృష్టించలేరని స్పష్టంచేశారు. జగన్ తీరు నచ్చక అనేక మందితమ పార్టీలో చేరుతున్నారన్న చంద్రబాబు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయల్ని తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో "రా.. కదిలి రా" బహిరంగసభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. ఈ సందర్భంగా వైసీపీకు రాజీనామాచేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం-జనసేన గెలుపు ఎవ్వరూ ఆపలేరన్న ఆయన.. అవసరమైతే తొక్కుకుంటూ పోతామని వైకాపాను హెచ్చరించారు. పల్నాడులో... ఎందరో కార్యకర్తలు వైకాపా చేతిలో బలయ్యారని.. ఆవేదన వ్యక్తంచేశారు. మంచినీళ్లు అడిగితే సామిని బాయ్ అనే గిరిజన మహిళనుట్రాక్టర్‌తో తొక్కించి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరహంతకులను వదలబోమని హెచ్చరించారు.


సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తమదన్న చంద్రబాబు అప్పులు చేయడం మాత్రమే తెలిసిన పార్టీ వైకాపా అని దుయ్యబట్టారు. కోవర్టులతో పవన్‌కు, తనకు మధ్య విభేదాలు సృష్టించలేరని చంద్రబాబు స్పష్టంచేశారు. నాగార్జున సాగర్ కుడికాలువ అభివృద్ధి పనులు, వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.


‘కార్యకర్తలను కాపాడుకునేందుకు యరపతినేని ఎన్నో త్యాగాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలి. వైకాపా ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలి. హూ కిల్డ్‌ బాబాయ్‌.. జగన్‌ ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. బాబాయ్‌ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలి. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని, ఎంతో బాధతో అన్న పార్టీకి ఓటు వేయొద్దని మీ చెల్లే చెప్పింది. సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి.. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా? టిష్యూ పేపర్‌లా వాడుకుంటారు.. జగన్‌ది యూజ్‌ అండ్‌ త్రో విధానం. మరో 40 రోజుల్లో జగన్‌ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. బెంగళూరు, ఇడుపులపాయ, కడప, హైదరాబాద్‌, తాడేపల్లిలో జగన్‌కు ప్యాలెస్‌లు ఉన్నాయి. అవన్నీ సరిపోక రుషికొండలో మరో ప్యాలెస్‌ కట్టారని చంద్రబాబు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story