Chandrababu: మహానాడులో వారిని సున్నితంగా హెచ్చరించిన చంద్రబాబు..

Chandrababu: అనుభవం అన్నింటి కన్నా విలువైంది. రాజకీయ నాయకులకు ముఖ్యంగా పాలకులకు అనుభవం, సమయస్పూర్తి ఎంతో అవసరం. ఈ విషయాన్ని మరోమారు నిరూపించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఒంగోలు మహానాడుకు జనం వెల్లువలా పోటెత్తారు. సభా ప్రాంగణమంతా సముద్రాన్ని తలపించింది. అయితే కార్యకర్తల్లోని ఈ ఉత్సాహం… ఒక దశలో సభ నిర్వహణకు చిన్నపాటి అంతరాయాన్ని కలిగించింది.
నాయకులను దగ్గరగా చూడాలని… లోకేష్ మాటలకు గట్టిగా కేరింతలు వేయాలన్న సంబరంలో కార్యకర్తలంతా… వేదికవైపు దూసుకొచ్చారు. దీంతో వేదిక పటిష్ఠతకే ముప్పు వాటిల్లే పరిస్థితి తలెత్తింది. దీంతో నాయకులందరూ కల్పించుకుని కార్యకర్తలను అదుపు చేసే పనిలో పడ్డారు. అయితే వారి ఉత్సాహం ముందు… వీరి హెచ్చరికలు పనిచేయలేదు. ఈ దశలోనే చంద్రబాబు మైకు అందుకున్నారు. ఓ అనుభవజ్ఞుడైన నేత సంక్షోభ పరిస్థితిని ఎలా అదుపు చేస్తాడో మరోసారి సోదాహరణంగా నిరూపించారు.
ఎక్కడా కార్యకర్తలను నిందించకుండా వారి ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూనే… సున్నితంగా హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి లక్షణమైన క్రమశిక్షణను అందరూ పాటించాలంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వేదికపై ఉన్న నాయకులను సైతం సున్నితంగా హెచ్చరిస్తూ.. తనకు కార్యకర్తలు, నాయకులు అందరూ సమానమనే సందేశాన్నిచ్చారు. అధినేత ఇచ్చిన ఆదేశాలను కార్యకర్తలు వెంటనే ఆచరణలో పెట్టడంతో.. నిమిషాల్లోపే పరిస్థితి అదుపులోకి వచ్చింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com