Chandrababu: బోగస్ ఐడీ కార్డులతో అక్రమాలకు పాల్పడ్డారు: చంద్రబాబు

Chandrababu: తిరుపతి సహకార బ్యాంక్ ఎన్నికల్లో అక్రమాలు నివారించాలంటూ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. బోగస్ ఐడీ కార్డులతో దుండగులు అక్రమాలకు పాల్పడుతుంటే.. దీన్ని ప్రశ్నించినవారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. వైసీపీయేతర అభ్యర్ధులు, ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనకుండా పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, అక్రమ నిర్బంధాలు జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి స్వేచ్చాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
20 లక్షల మంది వాటదారులు, 350 కోట్ల టర్నోవర్ ఉన్న తిరుపతి టౌన్ సహకార బ్యాంక్ నిధుల్ని కాజేసేందుకు వైసీపీ కుట్రపన్నిందని బ్యాంకుకు చెడ్డపేరు తెచ్చి, అస్తిరతకు గురిచేసేలా వైసీపీ యోచిస్తోందని లేఖలో రాశారు చంద్రబాబు. వైసీపీ మద్దతుదారులను గెలిపించేందుకు తిరుపతిలోని ఓ వర్గం పోలీసులు, అధికారపార్టీలతో కుమ్మకయ్యారని ఆరోపించారు. ఇప్పటికే వైసీపీయేతర అభ్యర్ధులపై పోలింగ్‌కు రెండ్రోజుల ముందు తప్పుడు కేసులు నమోదు చేశారని లేఖలో తెలిపారు. బ్యాంకు ఆస్తుల రక్షణ, బ్యాంకు సభ్యుల హక్కులను కాపాడేందుకు పోలింగ్ ప్రక్రియను రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com