Chandrababu: ఏపీ గవర్నర్‌కు చంద్రబాబు లేఖ.. గుడివాడ క్యాసినో వ్యవహారంపై..

Chandrababu: కృష్ణా జిల్లా గుడివాడ క్యాసినో వ్యవహారంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు.. టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖను గవర్నర్ కార్యాలయంలో కార్యదర్శికి టీడీపీ బృందం అందజేసింది. క్యాసినో నిర్వహణపై విచారణ జరిపించాలని కోరుతూ లేఖను అందజేశారు. తాము సేకరించిన ఆధారాలు, వీడియోలు అందజేశారు. కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరారు.
క్యాసినోపై విచారణ కోరుతూ కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్, ఏలూరు రేంజ్ డీఐజీతో పాటు డీజీపీకి చేసిన ఫిర్యాదుల కాపీలను లేఖకు జత చేశారు. కొడాలి నానిని రక్షించేందుకు ముఖ్యమంత్రి సహా అంతా తపనపడుతున్నారని విమర్శించారు టీడీపీ నేతలు. క్యాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇక చేసేది లేక గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.కొడాలి నానిని జైలుకు పంపే వరకు టీడీపీ వదిలిపెట్టదన్నారు.
కొడాలి నాని.. క్యాసినో నానిగా మారి రాష్ట్రంలో విష సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. క్యాసినో నిర్వహణ, ఉద్యోగుల సమస్యలు పక్కదోవ పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు టీడీపీ నేతలు. ఇంతవరకు విచారణ జరిపించని ముఖ్యమంత్రి కూడా క్యాసినోలో భాగస్వామా అని ప్రశ్నించారు. త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థల్ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. తక్షణమే ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com