SC: సుప్రీం తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

SC: సుప్రీం తీర్పుపై తీవ్ర ఉత్కంఠ
ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ... స్కిల్‌ కేసులో... 17ఏపై లిఖితపూర్వక వాదనల దాఖలుకు నేడు ఆఖరు..

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ(శుక్రవారం) విచారణకు రానుంది. తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు ఈ నెల 13న విచారణకు వచ్చినప్పుడు ఆయనకు 18వ తేదీ వరకు ఉపశమనం కల్పించింది. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో జ్యుడిషియల్‌ కస్టడీలో చంద్రబాబు ఉన్నారు. ఫైబర్‌ నెట్‌ కేసుకూ 17ఏ నిబంధన వర్తిస్తుందని సిద్ధార్థ లూథ్రా వాదించినందున స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో విచారణ పూర్తయిన తర్వాత దీనిపై విచారిస్తామని చెప్పి న్యాయమూర్తులు.. ఆ కేసును 17వ తేదీకి వాయిదా వేశారు. అదే సమయంలో చంద్రబాబును అరెస్టు చేయకుండా నిలువరించాలని ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. 17వ తేదీ ఈ కేసుపై విచారించడానికి సమయం లేకపోవడంతో ధర్మాసనం దాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటివరకూ అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ జరిగే విచారణపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.


మరోవైపు స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఏపై చంద్రబాబు దాఖలుచేసిన వ్యాజ్యంలో ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయడానికి ఇవాళే చివరి రోజు. మంగళవారం వాదనలు ముగించి వాయిదా వేసిన తీర్పును ధర్మాసనం ఎప్పుడు వెలువరిస్తుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. శనివారం నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు దసరా సెలవులు. 30వ తేదీన న్యాయస్థానం పునఃప్రారంభమవుతుంది.


చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండుకు వెళ్లి 40 రోజులు దాటింది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎం పదవిలో వున్న ఆయన ఇన్ని రోజుల పాటు జనానికి కనిపించకుండా ఉండడం ఇదే మొదటిసారి. దీంతో అభిమానులు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహానికి సంస్కారంతో సర్దిచెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా చంద్రబాబు అంశంపైనే చర్చ సాగుతోంది. మార్కెట్లు, బస్సులు, కూడళ్లు, వేడు కలు.. ఒక్కచోట కాదు. నలుగురు జనం ఎక్కడ పోగైనా చంద్రబాబు అంశమే చర్చకు వస్తోంది. 73ఏళ్ల వయసులో ఉన్న ఒక మాజీ సీఎంని ఇంతలా ఇబ్బందులకు గురిచేయ డం అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భువనేశ్వరికి సంఘీ భావం తెలియజేయడానికి వస్తున్న వారిని నిలువరించడం, కేసులు బనాయించడంపై విస్తుపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story