YS Vivekananda Reddy: ఆధారాలు లేకుండా వైఎస్‌ వివేకా హత్య.. ఛార్జిషీట్‌లో క్లారిటీ..

YS Vivekananda Reddy: ఆధారాలు లేకుండా వైఎస్‌ వివేకా హత్య.. ఛార్జిషీట్‌లో క్లారిటీ..
YS Vivekananda Reddy: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జిషీట్‌ వెలుగులోకి వచ్చింది.

YS Vivekananda Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జిషీట్‌ వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబరు 26న పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ నిందితులుగా ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. పథకం ప్రకారమే.. వివేకా హత్య జరిగినట్లు అందులో పేర్కొంది.

వివేకా హత్య జరిగిన రోజు ఘటనకు సంబంధించిన వివరాలు, ఆధారాలు లేకుండా చేయడంలో ప్రముఖుల పాత్రపై ఛార్జిషీట్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో 8 కోట్ల స్థలం సెటిల్‌మెంట్‌ విషయంలో వైఎస్‌ వివేకా, ఎర్రగంగిరెడ్డికి మధ్య గొడవలు మొదలయ్యాయని.. వివేకాను హత్యచేయడానికి ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి ప్రణాళిక రచించినట్లు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు సుపారీ ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని అందులో పేర్కొంది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు ప్రచారం చేసే విషయంలో నలుగురు చర్చించుకున్నారని అందులో తెలిపింది. ఎర్రగంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి సూచనల మేరకు బెడ్ రూం, బాత్ రూంలను పనివాళ్లు శుభ్రం చేశారని.. వివేకాకు ఏడుచోట్ల బలమైన గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని ఛార్జిషీట్‌లో సీబీఐ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ఈ కేసులో మళ్లీ విచారణ మొదలుపెట్టింది సీబీఐ. కడప జిల్లా పులివెందుల ఆర్‌ అండ్‌ బీ గెస్ట్ హౌస్‌లో విచారణ చేపట్టింది. ఈ విచారణకు ముగ్గురు అనుమానులు హాజరయ్యారు. గతంలో కడప జిల్లా సాక్షి రిపోర్టర్‌గా పనిచేసిన బాలకృష్ణారెడ్డి, పులివెందులకు చెందిన యూసీఐఎల్‌ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ మధుసూధన్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. వీరిని అనేక కోణాల్లో ప్రశ్నించారు సీబీఐ అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story