భారతి సిమెంట్స్ ఆగడాలకు చెక్.. చర్యలు తప్పవా..?

భారతి సిమెంట్స్ కు బిగ్ షాక్ తగలనుంది. వేలం ద్వారా కొత్త లీజులు పొందాలనే కేంద్ర ఆదేశాలు ఉన్నా సరే.. పాత దరఖాస్తులకు అనేక కారణాలు చూపించి రెండు సున్నపురాయి గనుల లీజులు పొందిన భారతి సిమెంట్స్ కు షాక్ తగలనుంది. ఈ రెండు గనుల లీజ్ ను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అయింది. ఈ మేరకు నివేదిక ఇవ్వాలని గనులశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఆ నివేదిక వెళ్లిన వెంటనే రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ తన ప్రభుత్వంలో తన కంపెనీలకు ఇష్టారీతిన పర్మిషన్లు ఇచ్చుకుంటూ స్పెషల్ జీవోలు ఇచ్చుకున్నారు. అవన్నీ రూల్స్ కు విరుద్ధంగా, సమాజానికి హాని చేసేలా ఉన్నా సరే వాటిని పట్టించుకోలేదు.
కేంద్రం 2015లో తీసుకొచ్చిన సవరణ వివరణల ప్రకారం.. ప్రధాన ఖనిజాల లీజులను వేలం ద్వారానే పొందాలి. 2015 జనవరి 12కు ముందు లీజు కోసం లెటరాఫ్ ఇంటెక్ట్ ఎవరికైనా జారీ చేస్తే.. 2017 జనవరి 11 నాటికి అన్ని పర్మిషన్లు తీసుకుని లీజులు పొందాలి. లేదంటే లీజులు రద్దయ్యే ప్రమాదం ఉంటుంది. కడప జిల్లా కమలాపురం ఎర్రగుంట్ల మండలంలోని రఘురాం సిమెంట్స్ కు సున్నపురాయి భూములు ఉండగా.. 2009లో భారతి సిమెంట్స్ కొనుగోలు చేసింది. అందులో రెండు సున్నప్పురాయి లీజులు కేటాయించాలని అప్పట్లోనే దరఖాస్తు చేయగా.. వాటికి ఎల్ వో ఐలు జారీ చేశారు. కానీ లీజులకు సంబంధించిన పర్మిషన్లు భారతి సిమెంట్స్ పొందలేకపోయింది.
రఘురాం సిమెంట్స్ భారతి సిమెంట్స్ గా మారిన విషయం చెప్పకపోవడంతో ఎల్ వో ఐలు ఉపసంహరించుకుంది అప్పటి ప్రభుత్వం. అప్పట్లోనే భారతి సిమెంట్స్ హైకోర్టుకు వెళ్లగా.. వాదనలు విని పర్మిషన్లు ఇవ్వాలని హైకోర్టు 2023లో సూచించింది. 2024 ఫిబ్రవరి 02న రెండు సిమెంట్ లీజులకు అప్పటి వైసీపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ కు నెల ముందు ఈ పర్మిషన్లు ఇచ్చింది. వీటిపై కూటమి ప్రభుత్వం న్యాయశాఖ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఏజీ సూచన తీసుకుంది. ఏజీ కూడా వీటి లీజులు రద్దు చేయడమే మంచిదన్నారు. దీంతో గనుల శాఖను ప్రభుత్వం నివేదిక కోరింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత లీజులను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. రూల్స్ కు విరుద్ధంగా జగన్ కేటాయించుకున్న ఈ లీజులు పర్యావరణానికి, చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటోంది కూటమి ప్రభుత్వం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com