CID ENQUIRY: సూటిగా సమాధానాలిచ్చిన చంద్రబాబు

CID ENQUIRY: సూటిగా సమాధానాలిచ్చిన చంద్రబాబు
చంద్రబాబును 5 గంటలపాటు విచారించిన సీఐడీ అధికారుల బృందం... దుష్ర్పచారంపై బాబు ఆవేదన...

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును రెండు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజు సీఐడీ అధికారుల బృందం తొలిరోజు ప్రశ్నించింది. సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా సమాధానాలిచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఏ నిర్ణయం, ఎందుకు తీసుకున్నామనేది శషభిషలు లేకుండా వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి తప్పిదమూ చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం, సీఐడీ అధికారులు జరగని కుంభకోణం జరిగినట్లు దుష్ప్రచారం చేస్తుండటం చాలా బాధాకరమన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారం లోపల ఉన్న కాన్ఫరెన్స్‌ హాలులో దాదాపు 5 గంటల పాటు సీఐడీ అధికారులు విచారణ జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఘంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణను నైపుణ్యాభివృద్ధి సంస్థలో కీలకబాధ్యతల్లో ఎందుకు నియమించారని సీఐడీ అడిగింది. ప్రపంచంలోని అత్యుత్తమ సాఫ్ట్‌వేర్‌ నిపుణుల్లో ఘంటా సుబ్బారావు ఒకరని, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కూడా ఆయనకు 3 కీలక పదవులిచ్చారని చంద్రబాబు చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకునే ఆయన్ని నైపుణ్యాభివృద్ధిసంస్థలో నియమించొచ్చేమో పరిశీలించాలని అధికారులకు సూచించానని చెప్పారు. ఆయన నియామకం బిజినెస్‌ రూల్స్‌కు అనుగుణంగానే జరిగిందని ఎగ్జిక్యూటివ్, ఆర్థిక అధికారాలు ఇవ్వలేదన్నారు.


కె.లక్ష్మీనారాయణ గతంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారని, ఆయన అనుభవాన్నివినియోగించుకోవటం సముచితంగా ఉంటుందని నైపుణ్యాభివృద్ధి సంస్థలోకి తీసుకున్నామన్నారు. ఈ నియామకం కూడా నిబంధనల ప్రకారమే జరిగిందని చంద్రబాబునాయుడు సీఐడీ అధికారుల బృందానికి చెప్పారు. నైపుణ్యాభివృద్ధి సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారని సీఐడీ అడగ్గా... యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలనేది తమ విధానమని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఉద్యోగాలు రావాలంటే యువతలో నైపుణ్యాలు పెంచాలి కాబట్టి వివిధ రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశానని అత్యుత్తమ ఫలితాలు సాధించామని చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా.. ఏదో కుంభకోణం జరిగిపోయిందంటూ మీరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా బాధాకరమని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

మధ్యాహ్నం 12 గంటల 15 నుంచి విచారణ ప్రారంభించిన సీఐడీ బృందం విచారణ ప్రక్రియ పూర్తయ్యాక రాత్రి 7గంటల ఎనిమిది నిమిషాలకు జైలు నుంచి బయటకు వచ్చింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ విచారణ కనిపించేంత దూరంలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story