AP: శాసనసభను హుందాగా కొనసాగిద్దాం

AP: శాసనసభను హుందాగా కొనసాగిద్దాం
X
సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు... అయ్యన్నకు చట్టసభల విలువ తెలుసన్న సీఎం

తెలుగు రాష్ట్రాల్లోనే బీసీ నాయకుల్లో అయ్యన్నపాత్రుడు సీనియర్‌ నేత అని, ఆయనకు స్పీకర్‌ స్థానం దక్కడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దూషణలు, వెకిలిచేష్టలు లేకుండా హుందాతనంతో శాసనసభ కొనసాగాలని ఆకాంక్షించారు. పవిత్రమైన శాసనసభను గత జగన్‌ ప్రభుత్వం నీచ రాజకీయాలు, వికృత పోకడలు, వ్యక్తిత్వ హనానికి వేదికగా మార్చేసిందని గుర్తుచేశారు. తొలిసారి ఎమ్మెల్యేలు అయినవారు కూడా.. ఆరేడుసార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న సీనియర్లను నోటికొచ్చినట్లు తిడుతూ, అసభ్యంగా ప్రవర్తించారని అన్నారు. ప్రతిపక్ష సభ్యులుగా గత ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే సభలోనే దాడి చేశారని, నీచంగా మాట్లాడి మనోభావాల్ని దెబ్బతీశారని పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని ఆయన, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రులు సత్యకుమార్‌, అచ్చెన్నాయుడు స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టారు.

సభాపతిగా ఏకగీవ్రంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడిని అభినందిస్తూ చంద్రబాబు శనివారం శాసనసభలో ప్రసంగించారు. అయ్యన్నపాత్రుడు చట్టసభల విలువ తెలిసిన వ్యక్తన్న చంద్రబాబు... ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుతారని అన్నారు. సభను హుందాగా నడిపిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. కౌరవసభను.. గౌరవసభగా మార్చిన తర్వాతే ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చెప్పి 2021 నవంబరు 19న సభలో నుంచి వెళ్లిపోయాను. మళ్లీ ప్రజలందరి ఆశీస్సులు, ఆమోదంతో సభలోకి ప్రవేశించానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తన గౌరవాన్ని కాపాడిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని, తెలుగుగడ్డ రుణం తీర్చుకోవాలనేది నా ఆకాంక్ష అని భావోద్వేగానికి గురయ్యారు.

ఇప్పటి వరకూ 16 శాసనసభలు కొలువుదీరగా.. వాటిలో తొమ్మిది సభల్లో తాను సభ్యుడిగా ఉన్నానని... అన్ని సభలు చూశాను కానీ.. గత ఐదేళ్లలో జరిగిన 15వ శాసనసభ లాంటి సభను తన జీవితంలో ఎన్నడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. ప్రస్తుత 16వ శాసనసభను అత్యున్నత సభగా, గౌరవప్రదంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజాప్రభుత్వంగా ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలని... తొమ్మిదోసారి తాను ఎమ్మెల్యేను. తనకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికీ రాలేదని అన్నారు.

ప్రజలు మనకు ఇచ్చింది అధికారం కాదని... బాధ్యత. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే బాధ్యత ఇచ్చారని చంద్రబాబు అన్నారు. మనం చేసే పనులు భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వికసిత భారత్‌ కలలాగానే. వికసిత ఆంధ్రప్రదేశ్‌ మనందరి కల కావాలి. తెలుగువారిని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేలా, ఆర్థిక అసమానతలు తగ్గించేలా, పేదరికం లేకుండా చేసేలా చర్చలు సాగేలా, చట్టాలు జరిగేలా ఈ సభ ఉండాలన్నారు.

Tags

Next Story