AP: "అప్పుడు ఏపీ ఛీ ఛీ.. ఇప్పుడు భలే భలే"

ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమని...ఈ ఏడాది లక్ష మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో పర్యటించిన సీఎం.. ఎంస్ఎంఈ పార్కును ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండం నాయునపల్లిలో చేనేత పార్కుకూ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించిన చంద్రబాబు రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులు తయారుచేయాలని సూచించారు. . కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు అన్నారు.
గత పాలకులు చేసిన పనులు బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరూ చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా వేదిక కూల్చడంతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందన్నారు. ‘‘రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నాం. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. వారు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నాం. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నాం. పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల ఉద్యోగాలంటే చాలా మంది అవహేళన చేశారు. ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ వారమంతా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. పెట్టుబడులతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. కష్టపడి పనిచేసే అద్భుత యువత ఏపీలో ఉంది. గత వైకాపా పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో వారు పారిపోయారు. ఒకప్పుడు ఏపీ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు ఏపీ అంటే భలేభలే అంటున్నారు. గూగుల్ లాంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయి. లక్షా నలభై వేల కోట్లు గూగుల్ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయి.’’ అని చంద్రబాబు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

