CBN: విశాఖ ఉక్కును లాభాల బాట పట్టిస్తాం

CBN: విశాఖ ఉక్కును లాభాల బాట పట్టిస్తాం
X
విశాఖ ఉక్కు ఏపీ సెంటిమెంట్.. కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామన్న చంద్రబాబు

విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను శాశ్వతంగా లాభాల బాట పట్టేలా కార్యాచరణ రూపొందిస్తామని సీఎం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ ఉక్కు సెంటిమెంటు అని, ప్రైవేటు పరం కానీయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని చంద్రబాబు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి గత ప్రభుత్వ వైఖరి కూడా ఓ కారణమని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజేషన్ కాకుండా.. గతంలో ఆపింది తానేనని సీఎం వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కుమార స్వామితో స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడానని.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొంత డబ్బులిచ్చి ఆపరేట్ చేయడానికి ముందుకెళ్తున్నారని.. ఉద్యోగులు, కార్మికులు కూడా ఆలోచించుకోవాలని సూచించారు.


ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లన్నీ లాభాల్లో ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లోకి వస్తుందో ఆలోచించాలని చంద్రబాబు అన్నారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ హక్కు అనేది నిరూపించుకోవాలంటే కష్టపడి పని చేయాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు సర్వ శక్తులా ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గత ఐదేళ్లల్లో ఎప్పుడైనా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అంటూ సీఎం ప్రశ్నించారు. ఏం చెప్పినా నమ్మే రోజులు పోయాయని అన్నారు. కొత్త మెడికల్ కాలేజీల గురించి జగన్ ఎలాంటి జీవోలు ఇచ్చారంటూ ప్రశ్నించారు. వైసీపీ వాళ్లేం చేశారో మరిచి.. ఇప్పుడు విమర్శలు చేస్తే చెల్లుతుందా అని ప్రశ్నించారు. ప్రజాహితం కోసం కొందరు పని చేస్తుంటే.. ప్రజలకు నష్టం కలిగించేందుకు ఇంకొందరు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అపరేషన్ బుడమేరు

ఆపరేషన్ బుడమేరు మొదలు పెడతాని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీని కోసం చట్టం తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. బుడమేరు దురాక్రమణలు తొలగిస్తామన్నారు. వరద ప్రాంతాల్లోని విద్యార్థులకు పుస్తకాలిస్తామని.. కేంద్రాన్ని వరద సాయం అడుగుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి నీట మునుగుతోందని కొందరు బుద్ది జ్ఞానం ఉంటే మాట్లాడగలరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదు, బెంగళూరు, బాంబే సిటీల పరిస్థితేంటీ..ఇంటి మీద నీళ్లొస్తే ఆకాశం మీదకు వెళ్తారా అంటూ ప్రశ్నించారు.

Tags

Next Story