CM Chandrababu : లడ్డూ అపవిత్రతపై చంద్రబాబు ఆగ్రహం

తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలను, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధ సారధితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హాయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్ లతో చర్చించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై అత్యంత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com